ఖమ్మం, జూలై 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమస్యలపై చర్చకు పట్టుబడితే సస్పెండ్ చేస్తారా? అంటూ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల పక్షాన పార్లమెంట్ వేదికగా ఉద్యమిస్తున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులపై కేంద్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ధరలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ భారాలపై మంగళవారం రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు చర్చకు పట్టుబట్టారు.
చర్చకు అనుమతిస్తే కేంద్రం డొల్లతనం బయట పడుతుందని, సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారనే వంకతో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతోపాటు ఎంపీలు బండి పార్థసారథిరెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, దీవకొండ దామోదర్రావును వారం రోజుల పాటు సభా కార్యక్రమాలకు హాజరుకాకుండా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సస్పెండ్ చేశారు. ఇవే అంశాలపై చర్చకు పట్టుబట్టిన మరో 16 మంది విపక్ష పార్టీల ఎంపీలను సైతం రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
మొహం లేకనే సస్పెన్షన్: వద్దిరాజు
కేంద్రం విధానాలపై పోరాడుతున్న టీఆర్ఎస్ ఎంపీల సస్పెన్షన్పై ఎంపీ వద్దిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పే మొహం లేకనే కేంద్ర ప్రభుత్వం తమను సస్పెండ్ చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ డొల్లతనాన్ని తెలంగాణ ప్రజా కోర్టులో తెలుస్తామని స్పష్టం చేశారు.