కొణిజర్ల, జూలై 26: రాష్ట్రంలోని ప్రతి రైతూ ఓ శాస్త్రవేత్తగా మారి నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోని రైతులందరికీ తెలంగాణ రైతులే దిక్చూచిగా మారే రోజు అతి దగ్గరలో ఉందని అన్నారు. మండలంలోని బస్వాపురం గ్రామానికి చెందిన యువ రైతు మల్లెంపాటి వెంకటేశ్వర్లు గత యాసంగిలో 8 ఎకరాల్లో పత్తి సాగు చేసి సత్ఫలితాలు సాధించాడు. దీంతో రైతు అనుభవాలను తెలుసుకునేందుకు మంత్రి నిరంజన్రెడ్ది మంగళవారం బస్వాపురం వచ్చారు.
ముందుగా ఆయన యువ రైతు ఇంటికి వెళ్లి రైతును, అతడి కుటుంబసభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ‘ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? యాసంగిలో పత్తి సాగు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎంత పెట్టుబడి వెచ్చించారు? ఎంత దిగుబడి లభించింది?’ అనే వివరాలను సదరు రైతును అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆ రైతు స్పందిస్తూ.. తాను కౌలుకు తీసుకున్న 8 ఎకరాల్లో మిరపసాగు చేయగా నల్ల తామరతో పంట దెబ్బతిన్నదని, దీంతో అప్పటికే ఏర్పాటు చేసిన డ్రిప్, మల్చింగ్ సహకారంతో రాశి కంపెనీ విత్తనాలతో ప్రయోగాత్మకంగా పత్తి సాగు చేపట్టాలని నిర్ణయించుకొని స్థానిక ఏవో బాలాజీ సలహాతో యాసంగిలో పత్తి వేసినట్లు తెలిపాడు. ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించానని, కానీ అంచనాకు మించి 16 క్వింటాళ్ల దిగుబడి రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు. నిరంతర విద్యుత్, పొలంలో ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ ఎంతో దోహదపడినట్లు మంత్రికి వివరించారు.
అనంతరం స్థానిక రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అక్కడకు హాజరైన రైతులను ఉద్దేశించి మాట్లాడారు.. రైతులకు మించిన శాస్త్రవే త్తలు లేరని, ఇలాంటి ప్రయోగాలు నూతన అధ్యయనానికి దారి తీస్తాయని అన్నారు. డిసెంబర్లో పత్తి సాగు మొదలుపెట్టి మే నెలాఖరు వరకు ఎకరాలో 16 క్వింటాళ్ల దిగుబడి సాధించడం పత్తి సాగులో నూతన విప్లవానికి నాంది అని అన్నారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే వేసవిలో పత్తి సాగు విధానానికి కొణిజర్ల మండలం నుంచి యువ రైతు శ్రీకారం చుట్టడం ప్రశంసనీయమన్నారు. కొండబాల కోటేశ్వరరావు, నల్లమల వెంకటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, కిలారు మాధవరావు, డోలే లక్ష్మీప్రసన్న, బచ్చు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.