కొత్తగూడెం క్రైం, జూలై 26 : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు పార్టీ వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీస్ యంత్రాంగం అప్రతమత్తమైంది. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతిచెందాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా కటేకళ్యాణ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జబర్మేటా సమీప అటవీ ప్రాంతంలో డీఆర్జీ భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి.
ఈ క్రమంలో జవాన్లకు మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే పక్కనే ఉన్న దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. ఇరువర్గాల మధ్య సుమారు 20నిమిషాలు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ అనంతరం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలకు సంఘటన స్థలంలో మావోయిస్టు మృతదేహంతోపాటు వారికి సంబంధించిన ఆయుధ, వస్తు సామగ్రిని బలగాలు స్వాధీనపరుచుకున్నాయి.
మృతిచెందిన మావోయిస్టు కటేకళ్యాణ్ ఏరియా కమిటీ సభ్యుడు బుధరామ్ మార్కంగా గుర్తించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. మృతుడిపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 28నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు నేతలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మావోస్టు పార్టీ జోనల్ కమిటీ కార్యదర్శుల పేర్లతో లేఖలు విడుదలవడం విశేషం. ఈ క్రమంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఆయా పోలీస్‌శాఖ అధికారులు మావోయస్టుల చర్యలను తిప్పికొట్టేందుకు పకడ్బందీ వ్యూహాలను రచిస్తున్నారు.