కూసుమంచి, జూలై 25: పాలేరుకు వచ్చే వరద నీటి కంటే విడుదలయ్యే నీరు ఎక్కువగా ఉండడంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. అయితే రిజర్వాయర్‌కు 8,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పాలేరు అలుగుల వద్ద గల ఆటోమేటిక్ గేట్ల నుంచి అదే 8,000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువ రెండో జోన్‌కు 2,500 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 150 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. దీంతో ఇన్‌ఫ్లో కంటే ఔట్ ఫ్లో 2,650 క్యూసెక్కుల నీటిని అదనంగా కిందకు విడుదల చేస్తుండటంతో క్రమంగా పాలేరు నీటిమట్టం తగ్గుతోంది.
సోమవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులకు చేరుకుంది. దీంతో పాలేరు రిజర్యాయర్‌ను డీఈ బాణాల రమేశ్‌రెడ్డి పరిశీలించారు. పూర్తిస్థాయి కంటే 1.5 అడుగుల తక్కువగా ఉండే విధంగా పాలేరు నీటిమట్టాని ఉంచుతామన్నారు. ఒకవేళ మళ్లీ వర్షాలు కురిసి వరదలు వస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సీఈ శంకర్‌నాయక్, ఎస్ఈ నర్సింహారావు, ఈఈ సమ్మిరెడ్డిలు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు.
కిన్నెరసాని నుంచి 16 వేల క్యూసెక్కులు..
పాల్వంచ రూరల్, జూలై 25: కిన్నెరసాని నుంచి సోమవారం రాత్రి 16 వేల క్యూసెక్కుల నీటిని డ్యాం సైట్ అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా సోమవారం రాత్రి నీటిమట్టం 402 అడుగులు ఉంది. ఇన్‌ఫ్లో 3500 క్యూసెక్కులుగా ఉండడంతో 3 గేట్లు ఎత్తి 16 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.