భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (నమస్తే తెలంగాణ): వానలు కురుస్తున్నాయి.. వ్యాధులు ప్రబలుతున్నాయి.. మానవాళికే కాదు ఈ సీజన్ జీవాలకూ వ్యాధుల కాలమే. పాడి రైతులు, గొర్రెల కాపరులు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు వాటిని ప్రాణాపాయం నుంచి తప్పిస్తాయి.. ఏ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా నివారించవచ్చు..? స్థానికంగా లభించే మందులతో వ్యాధులను ఎలా అరికట్టవచ్చు? అనే అంశాలపై అవగాహన ఉంటే వ్యాధుల ముప్పును సులువుగా తప్పించుకోవచ్చు. సీజన్లో జీవాలు వ్యాధుల బారిన పడడానికి ప్రధాన కారణం కలుషితమైన మేత తినడం, నీరు తాగడం. జీవాలు చిటుక, నీలి నాలుక, బురద పుండ్లు, జలగ వ్యాధి, గాలికుంటు, గొంతువాపు వ్యాధుల బారిన పడినప్పుడు యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.
ఒకవైపు వానలు.. మరోవైపు వరదలు.. ఈ సీజన్లో మూగజీవాలు ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీంతో పాడి రైతులు, గొర్రెల కాపరులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో జీవాలకు వచ్చే వ్యాధులు వాటి నివారణ మార్గాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అజాగ్రత్త వహిస్తే జీవన భృతిపై వేటు పడే అవకాశం ఉంది. సీజన్లో జీవాలు వ్యాధుల బారిన పడడానికి ప్రధాన కారణం కలుషితమైన మేత తినడం, కలుషిత నీరు తాగడం. కొన్ని వ్యాధులు ఒక జీవం నుంచి మరో జీవానికి ప్రబలే అవకాశం ఉన్నందున మొత్తం మందపైనే ప్రభావం పడే అవకాశం ఉంది.
సరైన సమయంలో వ్యాధిని గుర్తించి పశువైద్యులతో చికిత్స ఇప్పిస్తే ప్రమాదం నుంచి జీవాలను బయటకు తీసుకురావొచ్చు. పాడి రైతులు సంచార పశువైద్యశాల టోల్‌ఫ్రీ నంబర్ 1962కు కాల్ చేసి పశువైద్యులతో జీవాలకు చికిత్స అందించవచ్చు. గొర్రెలు, మేకలకు నీలినాలుక సోకకుండా పశువైద్యాధికారులు ఈ నెల 13 నుంచి 27 వరకు టీకాలు వేస్తున్నారు.
చిటుక వ్యాధి..
చిటుక వ్యాధికే మెడరసం వ్యాధి అని కూడా పేరు. ఇది ఎక్కువగా పెద్ద గొర్రెలకు సోకుతుంది. మేకలకు అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంది. జీవాల పేగుల్లోని బ్యాక్టీరియా నిలిచి వ్యాధి ప్రబలుతుంది. వ్యాధి నివారణకు గొర్రెల యజమానులు వానకాలంలో మూడు నెలలు దాటిన జీవాలకు టీకాలు వేయించాలి. రెండు నెలల తర్వాత బూస్టర్ డోస్ వేయించాలి. నట్టల మందు వేసి తూకం వేయాలి.
గొర్రెల్లో నీలి నాలుక..
వైరస్ కారణంగా గొర్రెలకు నీలి నాలుకకు వ్యాధి సోకుతుంది. దీనికే మూతి వ్యాధి, కూత రోగం అని పేరు. వ్యాధి ఒక రకమైన దోమకాటుతో వస్తుంది. ఏడాదిలో ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో వాతావరణం ద్వారా వైరస్ గొర్రెలను ఆశిస్తుంది. వ్యాధి వస్తే నెమరు వేయడం మానేస్తాయి. నోరి లోపల పొక్కులు ఏర్పడతాయి. నాలుక వాచి నీలిరంగులోకి మారుతుంది. గిట్టలు వాచి వాటికి పుండ్లు ఏర్పడతాయి. నోటిలోని పుండ్లను ఒకశాతం బోరిక్ యాసిడ్ లోషన్‌తో శుభ్రం చేయాలి. రెండు శాతం బోరి ్లగ్లిజరిన్ పూయాలి. గొర్రెలు ఆకలితో చనిపోకుండా రాగి జావ, మొక్కజొన్న జావ, ఆకులను ఆహారంగా ఇవ్వాలి. పశువైద్యులతో యాంటీబయోటిక్ టీకాలు వేయించాలి. బాగా నీరసించిన గొర్రెలకు గ్లూకోజ్ ద్రావణం ఎక్కించాలి.
బురద పుండ్లు..
పశువులు, ఇతర అనేక జీవాల్లో వ్యాధి కనిపిస్తుంది. వ్యాధి సోకితే గొర్రెలు, మేకల గిట్టలు మెత్తబడడం, గిట్టల్లో పగుళ్లు, రక్తం కారడం, కాలు కుంటడం, గిట్టలు ఊడిపోతాయి. ఎక్కువగా జ్వరం వచ్చి చనిపోతాయి. పశువులు బురద, పేడలో నిల్చున్నప్పుడు బ్యాక్టీరియా గిట్టల్లోకి ప్రవేశిస్తుంది. తద్వారా వ్యాధి బారిన పడతాయి. గిట్టల మధ్య ఎడం తక్కువగా ఉన్న పశువులకు ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది. పశువులను ఎప్పటికప్పుడు పొడిగా ఉన్నచోట కట్టేయాలి. వ్యాధి నివారణకు జీవాల గిట్టలను 5 శాతం ఫార్మాలిన్ ద్రావణంలో 10 నిమిషాల వరకు మునిగేట్లు ఉంచి తర్వాత శుభ్రంగా తుడవాలి. తుడిచిన గిట్టలకు జింక్ ఆక్సైడ్ లేదా కాపర్ సల్ఫేట్ ఆయింట్మెంట్ పూయాలి.
జలగ వ్యాధి..
జలగవ్యాధి పరాన్న జీవుల ద్వారా వస్తుంది. పశువుల పేడలో జలగ గుడ్లు నేల మీద పడతాయి. గుడ్లు ఉన్న చోట మేసిన గేదెలు, ఆవుల కాలేయంలోకి పరాన్నజీవి ప్రవేశించి వ్యాధిని తీవ్రతరం చేస్తుంది. వ్యాధి సోకిన పశువులకు ఆకలి మందగిస్తుంది. దవడ కింద నీరు వచ్చి వాపు వస్తుంది. పాల ఉత్పత్తి తగ్గుతుంది. వ్యాధి సోకిన పశువును గుర్తించి వైద్యుతో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధికి సంబంధించిన మందులను జీవాలకు వేయాలి.
గాలికుంటు వ్యాధి..
వైరస్ ప్రభావంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో వ్యాధి పాడి గేదెలు, ఆవులకు సోకుతుంది. కలుషితమైన గాలి ద్వారా వ్యాధి ప్రబలుతుంది. తల్లి పాల ద్వారా దూడలకూ వ్యాపించే అవకాశం ఉంది. దేశవాళి పశువుల కన్నా సంకరజాతి దూడల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన పశువులకు జ్వరం 104 నుంచి 108 వరకు ఉంటుంది. జీవాలకు పశువైద్యులతో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.
గొంతువాపు వ్యాధి..
గొంతువాపు వ్యాధికే గురక వ్యాధి అని పేరు. వ్యాధి వానకాలంలో జీవాలు కలుషితమైన మేత, నీరు తాగడంతో పశువులకు వ్యాధి సోకుతుంది. జీవాల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి ఒక పశువు నుంచి వేరొక పశువుకు సంక్రమిస్తుంది. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీలకు పైగా ఉంటుంది. గొంతుకిందకు నీరు దిగి గొంతువాపు వస్తుంది. నోటి నుంచి చొంగ కారుతుంది. పాడి రైతులు జీవాలకు జూన్, జూలైలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధి బారిన పడి పశువుల పాకలను రసాయనాలతో శుభ్రం చేయాలి.
జీవాలకు టీకాలు..
మిగతా సీజన్ల కంటే వర్షాకాలంలో జీవాలకు జబ్బులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. జీవాల యజమానులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సీజన్లో జీవాలు కొత్తగా మొలిచిన గడ్డిని తిని రోగాలు తెచ్చుకుంటాయి. నత్తలు తింటే వాటికి పారుడు జబ్బు వస్తుంది. ముందస్తుగా వాటిని గమనించి పశువైద్యులతో టీకాలు వేయించాలి. మురుగు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల పాకలు ఏటవాలుగా ఉండేలా చూసుకోవాలి. శుభ్రత లేకపోతే వ్యాధులు ప్రబలే అవకాశం చాలా ఎక్కువ.
– బి.పురంధర్, జిల్లా పశువైద్యాధికారి, కొత్తగూడెం