భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మామిళ్లగూడెం/ భద్రాచలం, జూలై 25: గ్రామాలు, పట్టణాల్లో సీజన్ వ్యాధుల నియంత్రణకు, పారిశుధ్య నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర, వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు.. జిల్లాల కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు. ‘సీజనల్ వ్యాధుల నియంత్రణ – రెసిడెన్షియల్ పాఠశాలల్లో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్’ అంశాలపై సంబంధిత శాఖల మంత్రులు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు కలిసి జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏల పీవోలతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలని సూచించారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రతీ రెసిడెన్షియల్ పాఠశాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి తనిఖీలు చేయాలన్నారు.
రోజూ ఫాగింగ్ చేయాలి: కలెక్టర్
గ్రామ, వార్డు స్థాయిలో హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి అంటువ్యాధుల నియంత్రణను ప్రత్యేక టీముల ద్వారా పర్యవేక్షించాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. హైరిస్క్ ప్రాంతాల్లో ఫీవర్ సర్వే నిర్వహించాలని, సర్వే చేసినట్లు ప్రతి ఇంటికీ స్టిక్కర్ అంటించాలని సూచించారు.
చర్యలు చేపడుతున్నాం: కలెక్టర్
అంటువ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాల్లో పారిశుధ్య, ఐఆర్ఎస్ కార్యక్రమాలు ముమ్మరం చేసి వ్యాధి నియంత్రణ చర్యలు చేపడతామని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. అంటువ్యాధుల నియంత్రణ చర్యలపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు సోమవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్.. జిల్లా డేటాను వివరించారు. మంత్రులు మాట్లాడుతూ.. వరదల్లో ప్రాణ నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని, చాలా బాగా పనిచేశారని అభినందించారు.