కారేపల్లి, జూలై 25: కండ బలాన్ని గుండె నిబ్బరాన్ని పంట చేనుకు అంకితమిచ్చే రైతుకు ఈ రోజుల్లో నష్టాలు, కష్టాలు సర్వసాధారణమయ్యాయి. అన్నదాతలు ఎప్పుడైతే సంప్రదాయ సాగును విస్మరించి పురుగుమందుల వెంటపడ్డారో అప్పుడే వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. పెట్టుబడి కొండంత అవుతోంది. కానీ దిగుబడి, రాబడి మాత్రం గోరంతే వస్తోంది. అయితే వీటన్నింటినీ ఎదురించి ఆకు కూరల సాగుచేస్తూ ఆర్థిక స్వాలంబన సాధిస్తున్నారు కారేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు.
సింగరేణి మండలంలోని కారేపల్లి క్రాస్‌రోడ్, విశ్వనాథపల్లి, బజ్యాతండా, మధురానగర్తండా, గిద్దెవారిగూడెం తండా, తులిశ్యాతండా, రావోజీతండా, పోలంపల్లి, పేరుపల్లి, జోగ్గూడెంతో పాటు మరికొన్ని గ్రామాల్లోని రైతులు ఆకుకూరలను అధికంగా సాగు చేస్తున్నారు. అందరిలా కాకుండా పురుగుమందుల వాడడం వల్ల నష్టాలు తప్పవన్న వాస్తవాన్ని గమనించారు. ప్రత్యామ్నాయ పద్ధతిలో సాగు చేయాలనుకొని సేంద్రియ సాగు విధానాన్ని ఎంచుకున్నారు. మండలంలో సుమారు వంద ఎకరాల్లో రైతులు ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో శ్రమతో లాభాలు ఆర్జిస్తున్నారు.
దీంతో మిగిలిన రైతులు కూడా ఆకు కూరల సాగుకు మొగ్గు చూపుతున్నారు. తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర, పుదీన, చుక్కకూర, బచ్చలికూర వంటివి ఎక్కువగా పండిస్తున్నారు. కారేపల్లి క్రాస్‌రోడ్ నుంచి ఇల్లెందు మార్గంలో జోగ్గూడెం సమీపంలో, కారేపల్లి మార్గానికి ఇరువైపులా ఎటు చూసినా ఆకుకూరల పంటలు కన్పిస్తుంటాయి. చివరికి ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో సైతం ఆకుకూరలను సాగు చేసి గృహిణులు లాభాలు ఆర్జిస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో ఆకుకూరలు సాగు చేసేందుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల ఖర్చవుతుంది. పంట చేతికి వచ్చిన తర్వాత రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్‌ను బట్టి రైతులకు ఆదాయం లభిస్తుంది. కేవలంం 15 రోజుల వ్యవధిలోనే పంట చేతికొస్తుంది. కూలీల అవసరం పెద్దగా లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్‌ను అందించడం రైతులకు కలిసొచ్చే అంశం.
రోజుకు సుమారు వెయ్యి కట్టలు విక్రయిస్తాం..
మాకున్న నాలుగు కుంటల స్థలంలో ఆకుకూరలు పండిస్తున్నాం. అంతకు ముందు రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్లం. పదేళ్లుగా ఆకు కూరలు సాగు చేస్తున్నాం. ఏడాదిలో 10 నెలలపాటు ఆకుకూరలు సాగు చేస్తాం. ప్రతిరోజూ ఉదయం నేను, నా భార్య కలిసి ఆకుకూరలు కోసి కట్టలు కడతాం. వాటిని నేను ఖమ్మం తీసుకెళ్లి కూరగాయల మార్కెట్, రైతుబజార్లలో వేసి వస్తాను. రోజుకు 1000 నుంచి 1500 ఆకు కూరల కట్టలను అమ్ముతాం. మార్కెట్లో రేటును బట్టి మంచి ఆదాయం వస్తుంది. -బట్టు శంకర్, రైతు