భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (నమస్తే తెలంగాణ) :ఇటీవల కురిసిన వర్షం జనజీవనాన్ని అతలా కుతలం చేసింది. ముంపు ప్రాంతవాసుల బతుకు చిత్రాన్ని మార్చేసింది. వారికి తీరని వేదన, నష్టాన్ని మిగిల్చింది. గోదావరి వరద పోటెత్తడంతో జిల్లాలోని రోడ్లు ధ్వంసమ య్యాయి. రోడ్లు, భవనాలకు దాదాపు రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారుల అంచనా. సుమారు 35 రహదారులు 251.50 కిలోమీటర్ల మేర కోతకు గురయ్యాయి. ఆరు వంతెనలు కుంగిపోయాయి. జాతీయ రహదారులు కూడా దెబ్బతిన్నాయి.
గోదావరి వరదలకు జిల్లాలోని రోడ్లు, భవనాలశాఖ కుదేలైంది. రూ.99.96 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ముంపు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా దెబ్బతిన్న రహదారులే దర్శనమిస్తున్నాయి. రవాణా వ్యవస్థను వరద గోదావరి నట్టేట్లో ముంచేసింది. రోడ్లన్ని చిత్తడిగా మారాయి. ఛిద్రమయ్యాయి. వంతెనలు, రోడ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. రోడ్లు, భవనాలశాఖ ఆధ్వర్యంలో ఉన్న రహదారులతోపాటు జాతీయ రహదారులు సైతం దెబ్బతిన్నాయి. ముఖ్యంగా భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల్లో ఆర్అండ్బీకి భారీగా నష్టం వాటిల్లింది. వరద ఉగ్రరూపానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో చాలా గ్రామాల్లో దారులు లేక లారీలు, ఇతర వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మారుమూల గ్రామాల్లో వాగులు పొంగడంతో చిన్నదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆటోలు కూడా వెళ్లలేని పరిస్థితి. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో రహదారులు మురుగుతో నిండిపోయాయి. వరదకు పొలాల నుంచి కొట్టుకొచ్చిన బురద రోడ్లపైకి చేరింది. ప్రధాన రహదారులు సైతం గుంతలమయంగా మారాయి.
కుంగిన రహదారులు, వంతెనలు
వరద ముంపునకు రహదారులు కుంగిపోయాయి. వంతెనలు పగుళ్లు వచ్చాయి. జిల్లాలో ఆరు కల్వర్టులకు పగుళ్లు రాగా, 35 రహదారులు కొట్టుకుపోయాయి. దీంతోపాటు జాతీయ రహదారులు ఇల్లెందు నుంచి కొత్తగూడెం మధ్యలో దెబ్బతినగా, రుద్రంపూర్ నుంచి భద్రాచలం వరకు జాతీయ రహదారికి భారీగా గుంతలుపడ్డాయి. భద్రాచలం వంతెనపై భాగంలో కూడా రహదారి గుంతలమయంగా తయారైంది.
రూ.99.96 కోట్ల నష్టం
భారీ వరదలకు రోడ్లు, భవనాలశాఖకు భారీగానే నష్టం వాటిల్లింది. 35రహదారులు 251.50 కిలోమీటర్ల రహదారి కోతకు గురవగా వాటి నష్టాన్ని రూ.79.19 కోట్లుగా అంచనా వేశారు. దీంతోపాటు 6 వంతెనలు కుంగిపోవడంతో వాటి విలువ రూ.20.77 కోట్లుగా అంచనా వేశారు. జాతీయ రహదారులకు కూడా మరో రూ.2.52 కోట్లు నష్టాన్ని అంచనా వేశారు. మొత్తంగా రవాణా వ్యవస్థ మెరుగుపడాలంటే రూ.99.96 కోట్ల ఉంటే తప్ప బాగుపడని పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్రబృందం ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేశారు. ముంపు నష్టం నివేదికను కలెక్టర్ అనుదీప్ సెంట్రల్ బృందానికి అందజేశారు.
రోడ్లన్నీ పాడయ్యాయి..
ఏ ఊరు వెళ్లినా దారులన్నీ గుంతలతో దర్శనమిస్తున్నాయి. లారీలన్నీ నిలిచిపోయాయి. రాకపోకలు ఆగిపోయాయి. కిరాయిలు లేవు. కిరాయికి వెళ్తే ఇరుక్కుపోవాల్సిందే. ప్రమాదాలు జరిగితే తీవ్రనష్టం వాటిల్లుతుంది. లారీ రోడ్డు పక్కకు వెళ్తే జారిపోయినట్టే.. అంతా బురద ఉంది. కొన్నిచోట్ల కల్వర్టులు పడిపోయాయి. కరెంటు స్తంభాలు రోడ్ల మీదే ఉన్నాయి. డ్రైవర్లకు చాలా కష్టాలు వచ్చాయి. – రావూరి శ్రీనివాస్, లారీడ్రైవర్, బంజర, బూర్గంపహాడ్
వాహనాలు దెబ్బతింటున్నాయి..
వరద వచ్చిన దగ్గర నుంచి కిరాయిలు లేవు. ఇళ్లు గడవాలంటే ఆటో నడపాల్సిందే. అలా అని ఆటో తీస్తే గుంతలరోడ్ల వల్ల వాహనం గుల్లవుతున్నది. రోజూ రిపేర్ చేయించుకోవాల్సి వస్తున్నది. తప్పని పరిస్థితుల్లో ఆటోలు బయటకు తీస్తున్నాం. భద్రాచలం నుంచి బూర్గంపహాడ్ వరకు దారి అసలు బాగా లేదు. తాత్కాలికంగానైనా బాగుచేస్తే మంచిది. బస్సులు, లారీలు వల్ల రోడ్లు ఇంకా దెబ్బతింటున్నాయి. – నరేశ్, ఆటో యజమాని, లక్ష్మీపురం, బూర్గంపహాడ్