ఖమ్మం, జూలై 24: వర్షాకాలం వస్తూ వస్తూ వ్యాధులను వెంట తీసుకొస్తుంది.. వరద నీరు గుంటలు, కాలువల్లో నిలిచి ఉండడంతో దోమల సంఖ్య పెరుగుతుంది.. దోమలు కుట్టడంతోనే మనకు డెంగీ, మలేరియా, ఫైలేరియా, మొదడువాపు వంటి అనేక రోగాలు వస్తాయి.. తాగేనీరు కలుషితం అయితే డయేరియా వంటి వ్యాధులు వస్తాయి.. రోగాల విజృంభణతో ఇక ఆస్పత్రులను ఆశ్రయించడం, వేలకు వేలు ఫీజులు చెల్లించి చికిత్స తీసుకోవడం, జేబులకు చిల్లులుపడడం ఖాయం. కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితులు విషమించి ప్రాణాలు పోవచ్చు. అందుకే ప్రజలారా.. తస్మాత్ జాగ్రత్త.. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి.. వ్యాధుల వ్యాప్తి, నివారణ మార్గాలపై అవగాహన పెంచుకోండి.. అదే మీకు శ్రీరామరక్ష !
మలేరియా..
మలేరియాకు కారణం అయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవి ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఇవి మురుగు నీటి కాలువలు, చెరువులు, నీరు నిల్వ ఉన్న కుంట ల్లో, పంట కాలువలు, పొలాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఇవి రాత్రిపూటే ఎక్కువగా కుడుతాయి. దోమ కుట్టినప్పుడు కొందరికి నొప్పి, దద్దులు కలగవచ్చు. దోమ కాటుతో శరీరం లోకి ప్రవేశించిన ప్లాస్మోడియం పరాన్నజీవి ఎర్రరక్తకణాలపై దాడి చేస్తుంది. ఇందులో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మో డియం ఫాల్సిపేరమ్ అనేవి రెండు రకాలు ప్లాస్మోడియం వైవాక్స్లో జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి. ఇవి అంత ప్రమాదకరమైనవి కావు. కానీ రెండో రకం ఇప్పుడు ఎక్కువగా కన్పిస్తుంది. దీనిని త్వరగా గుర్తించి చికిత్స అందిం చకపోతే కాలేయాన్ని, కిడ్నీలను, రక్తకణాలను దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మెదడుపై దాడి చేసి మెదడుకు ఎక్కి సెరిబ్రల్ మలేరియాకు దారి తీయవచ్చు. కొన్ని సార్లు రక్తం గడ్డకట్టే ప్రక్రియను దెబ్బతీసి రక్త స్రావానికి కూడా కారణం అవుతుంది.
లక్షణాలు..
చికెన్ గున్యా..
ఇది కూడా ఈడిన్ ఈజిఫ్ట్ దోమ ద్వారానే వస్తుంది. ఇది పగటి పూట ఎక్కువగా కుడుతుంది. గున్యా వైరస్ బారిన పడ్డవారిని కుట్టిన దోమ మరొకరిని కుట్టడం ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకితే శరీరంలొ ఉన్న కీళ్లు, ఎముకలు విపరీతమైన నొప్పులు ఉండి కనీసం నిలబడటానికి, నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది.
లక్షణాలు…
డెంగీ…
ఈడిన్ఈజిప్ట్ దోమ కుట్టడం కారణంగా డెంగీ సోకుతుంది. నల్లగా ఉండే ఈ దోమ ఒంటి మీద తెల్లని చారలు ఉంటాయి. దీని శరీరంలోకి డెంగీ వైరస్ ప్రవేశించిన 7 – 8 రోజుల తరువాత దాని ద్వారా మనుషులకు వ్యా పిస్తుంది. ఇది కుట్టినప్పుడు నొప్పి ఉండదు. ఇది రాత్రి పూట కంటే పగటి పూట ఎక్కువగా కుడుతుంది. ఈ దోమ మంచినీటిలో వృద్ధి చెందుతుంది. మూతలు లేని నీళ్ల ట్యాంకులు, సిమెంట్, తారు రోడ్డుపై నిలిచే వర్షపు నీటిలో వాటి పడేసిన ప్లాస్టిక్ వస్తువుల్లో, ఇంట్లో ఉండే పూల కుండీలల్లో, కూలర్లు, పాత టైర్లు, తాగి పడవేసిన కొబ్బరి బొండాలలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఒకప్పుడు డెంగీ పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఉండేది. అది క్రమేపీ గ్రామాలకు, తండాలకు అన్ని ప్రదేశాలకు పాకింది.
లక్షణాలు…
మెదడువాపు..
ఇది పందుల నుంచి దోమ ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. పందుల్లో ఈ వైరస్ ఉన్న వాటికి ఏమీ కాదు. పందులను కుట్టిన దోమలు తిరిగి మనుషులను కుట్టడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. మెదడు వాపు వ్యాధి చా లా ప్రమాదకరమైనది. ఇది ఎక్కువగా ఇళ్లల్లో ప్రాణాం తకంగా పరిణమించే అవకాశం ఉంది.
లక్షణాలు…
ఫైలేరియా…
ఈ వ్యాధి ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా ఉకరేరియా బ్రాంకాప్టీ అనే వైరస్ వలన వస్తుంది. ఇవి మురుగు నీరు, బురద ఎక్కువగా ఉన్న గుంతలు,సెప్టిక్ ట్యాంకుల్లో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. మంచినీటిలో కూడా పెరగవచ్చు.
లక్షణాలు..
లార్వా దశలోని ఫైలేరియా కారక వైరస్ మనుషుల రక్తంలోకి ప్రవేశించినప్పటికీ పైకి మామూలుగానే కనపడతారు. వివిధ దశల తరువాత ఇవి విశ్వరూపం చూపేడతాయి.
ఏ చిన్న అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు..
వానాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది..ఈ కాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా చేయవద్దు..ముఖ్యంగా జ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలి..ఆహారం విషయంలో కనీస జాగ్రత్తలు పాటించాలి..త్రాగే నీటి విషయంలో కూడా చిన్న చిన్న విషయాలను పాటించినట్లయితే పెద్ద పెద్ద వ్యాధులకు దూరంగా ఉండవచ్చు..దోమల భారిన పడకుండా జాగ్రతలు తీసుకోవాలి.ఎక్కువ శాతం వేడి పధార్దాలను తీసుకునే ప్రయత్నం చేయాలి
–నారగాని రాంప్రసాద్ (ఎండీ, జనరల్ మెడిసిన్)