అశ్వారావుపేట/ఇల్లెందు రూరల్, జూలై 24: ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి పెను ప్రమాదం ఉంది. దీంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై సర్కార్ యుద్ధం ప్రకటించింది. ఈ నెల 1 నుంచి 120 మైక్రాన్ల కన్న తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు, వస్తువులపై నిషేధం విధించింది. దీంతో కవర్ల విక్రయాలపై యంత్రాంగం నిఘా పెట్టింది. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో మార్కెట్లో వాడకం బాగా తగ్గింది. క్యారీ బ్యాగుల స్థానంలో ప్రజలు క్లాత్‌తో తయారు చేసిన క్యారీ బ్యాగులు వాడుతున్నారు. ఇది మంచి శుభ పరిణామంగా వారు భావిస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లేటప్పుడు ఇంటి నుంచే సంచులు తీసుకొస్తున్నారు. అధికారులు కవర్ల వినియోగంతో కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తున్నారు. కవర్లకు బదులు క్లాత్ బ్యాగులు వినియోగించాలని సూచిస్తున్నారు.
జరిమానా ఇలా..
120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఎవరైనా తయారు చేస్తే అధికారులు మొదటి హెచ్చరికతో రూ.50 వేలు, వాటిని విక్రయిస్తే వ్యాపారులకు రూ.2,500 వరకు జరిమానా విధిస్తారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తయారు చేస్తూ రెండో సారి పట్టుబడితే రూ.లక్ష వరకు, అదే విధంగా రెండోసారి కవర్లు విక్రయిస్తూ వ్యాపారులు పట్టుబడితే రూ.5 వేల వరకు జరిమానా విధిస్తారు. సదరు దుకాణాన్ని సీజ్ చేస్తారు. ప్లాస్టిక్ బ్యాగులు వాడుతూ ఎవరైనా కనిపిస్తే వారికి రూ.250- రూ.500 వరకు జరిమానా విధిస్తారు. ప్లాస్టిక్ వస్తువులు కాల్చే వ్యక్తులు, సంస్థలు తీవ్రతను బట్టి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలు..
ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిపోవు. కొన్ని వందల సంవత్సరాలు అలాగే ఉంటాయి. కొన్ని సాధు జంతువులు వాటిని తిని అనారోగ్యం పాలవుతున్నాయి. కవర్లు మురుగు కాల్వలు, డ్రైనేజీలో వేయడంతో మురుగు ప్రవాహం ఆగిపోతుంది. తద్వారా అక్కడ దోమల లార్వాలు పెరుగుతాయి. దీంతో ఆయా ప్రాంతాలు దోమలకు ఆవాసంగా మారతాయి. సీజనల్ వ్యాధులూ విజృంభించే అవకాశం ఉంటుంది. సర్కార్ సమరానికి వ్యాపారులు, ప్రజలు సహకరిస్తే పూర్తి సత్ఫలితాలు అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
నిత్యం నిఘా..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. ప్లాస్టిక్ కవర్లు వినియోగించవద్దని ఇప్పటికే వ్యాపారులకు నోటీసులు ఇచ్చాం. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటున్నాం. కవర్లు ఇస్తున్న వ్యాపారులకు జరిమానా విధిస్తున్నాం. ఎక్కువ సార్లు అదే తప్పు చేస్తే దుకాణాలను సీజ్ చేస్తాం. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్ల వినియోగం చాలా తగ్గింది.
– హరికృష్ణ, పంచాయతీ ఈవో, అశ్వారావుపేట