భద్రాచలం, జూలై 24: ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఎటపాక, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలోని రాజుపేట సెంటర్ వద్ద ఆదివారం ఐదు విలీన పంచాయతీల గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఐదు పంచాయతీలు తెలంగాణలో కలిపితేనే భద్రాచలం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే భద్రాచలం ఏకాకిగా మిగిలిపోయిందన్నారు. పంచాయతీలను రాష్ట్రంలో విలీనం చేస్తేనే భద్రాచలానికి మనుగడ ఉంటుందన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా గ్రామాలను ఏపీలో విలీనం చేయడం దారుణమన్నారు. వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి చేసిన తప్పును కేంద్ర ప్రభుత్వం సరిదిద్దుకోవాలన్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రజాభీష్టం మేరకు పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు, సీపీఐ, సీపీఎం కాంగ్రెస్ నాయకులతోపాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.