భద్రాద్రి కొత్తగూడెం, జూలై 23 (నమస్తే తెలంగాణ) : వరద గోదావరి రైతులకు కన్నీటిని మిగిల్చింది. పంటలన్నీ నీటిపాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1986ని మించి వరదలు రావడంతో రైతులు భారీగా నష్టాన్ని చవిచూశారు. పంటల పరిశీలనకు వచ్చిన అధికారులకు వారి గోడును వినిపించుకొని ‘మాకు న్యాయం చేయండి సారూ’ అని ప్రాథేయపడుతున్నారు. సరిపడా వానలు కురిశాయి.. ఈసారి డోకా లేదు అనుకొని పంటలు వేసుకున్న రైతుల బాధ వర్ణాతీతంగా మారింది. జిల్లావ్యాప్తంగా 17,637 ఎకరాల్లో పంటను నష్టపోయారు.
మొత్తం 128గ్రామాల్లో 6,765 మంది రైతులకు రూ.9.89 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. పత్తి 59 గ్రామాల్లో 7,086 ఎకరాలు, వరి 52 గ్రామాల్లో 3,617 ఎకరాలు, జొన్న 2 ఎకరాలు, పిల్లిపెసర 7 ఎకరాలు, జీలుగు 108 ఎకరాలు, కూరగాయలు, డ్రాగన్ ఫ్రూట్ పంటలకు 35 ఎకరాల్లో నష్టం జరిగింది. దీంతోపాటు 326 ఎకరాల్లోని పంటల్లో ఇసుక మేటలు వేసినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.9.89 కోట్ల పంటనష్టం జరిగినట్లు కేంద్ర బృందం కూడా పరిశీలించింది. కేంద్ర బృందానికి కలెక్టర్ అనుదీప్ నివేదిక సమర్పించారు. ఈసారి పత్తి పంట మంచి దిగుబడి వస్తుందని ఆశపడి ఎక్కువ ఎకరాల్లో సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరదలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వనాశనం అయిపోయింది
పొలాన్నే నమ్ముకొని బతుకుతున్నాం. విపత్తు వచ్చి మా పంటలను ముంచేసింది. ఏడాది కాలం మాకు పనులు ఉండవు.. పంటలు వేసే సమయం కూడా దాటిపోయింది. దుక్కులు, ఎరువులు, కూలీలకు చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. రైతుబంధు సొమ్ములు మొత్తం అయిపోయాయి. పంట ఉంటేనే పెట్టుబడి ఇస్తారు. నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– దారం రాంరెడ్డి, రైతు, సంజీవరెడ్డిపాలెం
వరద మా కొంప ముంచింది
గోదావరి వరద మా పంటను, కొంపను ముంచేసింది. అధికారులే మమ్మల్ని గట్టెక్కించాలి. తిండిగింజలు ఎలా సంపాదించుకోవాలి.. వ్యవసాయం ఎలా చేయాలో అర్థం కావడం లేదు. మా బతుకులు మళ్లీ వెనక్కిపోయాయి. రైతుల కష్టాలను ఎరిగిన సీఎం కేసీఆర్ సార్ మమ్మల్ని ఆదుకోవాలి.
– కైపు శ్రీనివాసరెడ్డి, రైతు, సంజీవరెడ్డిపాలెం
పంట నష్టాన్ని అంచనా వేశాం
వరద ఉధృతికి పంటలు బాగా దెబ్బతిన్నాయి. చేతికందే సమయంలో పంటనష్టం జరిగింది. నష్టాన్ని అంచనా వేశాం. పరిహారం వస్తే రైతులకు కొంత ఇబ్బంది తగ్గుతుంది. మళ్లీ వరదలు వస్తే ఇంకా పంటలను కోల్పోయే ప్రమాదం ఉంది. వచ్చే ఆగస్టులో భారీ వర్షాలు ఉన్నాయి. ఇసుక మేటలు కూడా వేశాయి.
– కొర్సా అభిమన్యుడు. డీఏవో