ఖమ్మం, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాచలం వద్ద గోదావరి వరద శనివారం హఠాత్తుగా పెరిగి సాయంత్రానికి క్రమేణా తగ్గుతూ వచ్చింది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. చాలా చోట్ల చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పాలేరు రిజర్వాయర్‌కు సామర్థ్యానికి మించి వరద రావడంతో నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.
దాదాపు 38 ఏళ్ల తరువాత మొదటిసారి పాలేరు బ్రిడ్జిపై వరద ప్రవహించడంతో ఉదయం కొద్దిసేపు హైదరాబాద్ – ఖమ్మం ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. వరదనీరు బ్రిడ్జిపై ప్రవహించడంతో రెండు వైపులా వెళ్లే దారిని ఒక వైపు మళ్లించి అదే మార్గంలో రాకపోకలు జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. వైరా, లంకాసాగర్, అశ్వారావుపేట పెద్దవాగు, సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులకు పెద్ద ఎత్తున నీరు చేరింది.
ఆయా జలాశయాల్లో జలకళ ఉట్టిపడుతోంది. ఇక భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోమారు దోబూచులాడింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు 40.60 అడుగులుగా ఉన్న నీటిమట్టం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 45.90 అడుగులకు పెరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు కొద్దిమేర శాంతించి 45.80 అడుగులకు తగ్గింది. రాత్రి 7 గంటలకు 44.50 అడుగుల వద్ద ఉంది. గోదావరి వరద పెరుగుతూ తగ్గుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నేతృత్వంలో సహాయక చర్యలకు సన్నద్ధమయ్యారు. పది రోజుల క్రితం వచ్చిన వరదకు ముంపునకు గురైన ప్రజలు ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకొని వాటిని శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వరద మళ్లీ పెరుగుతూ, తగ్గుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు మరోసారి అప్రమత్తం చేశారు. రెండో ప్రమాద హెచ్చరికను యథావిధిగా కొనసాగిస్తున్నారు. భద్రాచలం ప్రాంతంలో ముంపునకు గురైన కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు చేస్తున్న సర్వే దాదాపు పూర్తయింది. అర్హుల జాబితాను మండలాల వారీగా, ప్రాంతాల వారీగా సిద్ధం చేస్తున్నారు. అర్హులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కానుంది.