టేకులపల్లి, జూలై 21: కూరగాయల్లో రారాజు బోడ కాకర అంటే అతిశయోక్తి కాదు. ధరలోనూ ఇదే కింగ్. ధర ఎంత పెరిగినా జనం ఇష్టపడి మరీ కొనుగోలు చేసే కూరగాయల్లో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. ఆదరణ, డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీనిని సాగు చేసిన రైతులందరూ అధిక లాభాలు సాధిస్తున్నారు. బోడకాకర కాయల సాగును అన్ని పంటల కంటే ముందుగానే (మే నెలలోనే) ప్రారంభిస్తారు. రెండు నెలల్లోనే పంట చేతికొస్తుంది. ఆరు నెలల వరకు పంట దిగుబడి ఉంటుంది. సీజన్, డిమాండ్‌ను బట్టి కిలో రూ.80 నుంచి రూ.200 వరకూ ఉంటుంది. సీజన్ ముగిసే నాటికి రూ.200కు పైమాటే. అధిక మొత్తంలో దిగుబడి వచ్చే బోడకా కరలో పోషకాలు, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. అందుకే దీనికి ఆదరణ ఎక్కువ. ఈ పంటను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 350 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. టేకులపల్లి మండలంలో అత్యధికంగా 54 ఎకరాల విస్తీర్ణం సాగవుతూ మొదటి స్థానంలో ఉంది. ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బోడకాకర పందిళ్లకు రూ.లక్ష సబ్సిడీ..
బోడకాకర పంట సాగు చేసే రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం రూ.లక్ష వరకూ సబ్సిడీ ఇస్తోంది. బోడకాకర సాగుకు ముఖ్యంగా కావాల్సింది పందిళ్లు. వాటి ఏర్పాటుకు గతంలో హార్టికల్చర్ శాఖ ద్వారా రాయితీలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈజీఎస్ ద్వారా ఎకరాకు రూ.లక్ష వరకు సబ్సిడీ ఇస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని టేకులపల్లి, సుజాతనగర్, ఇల్లెందు, అశ్వాపురం, బూర్గంపహాడ్, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, జూలురుపాడు, అశ్వారావుపేట, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో 350 ఎకరాల విస్తీర్ణంలో బోడకాకరను సాగు చేస్తున్నారు.
డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేస్తున్నాం..
ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సూచనల మేరకు పంటల సాగును అనుసరిస్తున్నాం. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సీఎం సార్ చెప్పడంతో మేము కూడా అదే బాటలో నడుస్తున్నాం. డిమాండ్ ఉన్న బోడకాకర పంటను సాగు చేస్తున్నాం. లాభాలూ బాగానే వస్తాయి. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుండడంతోపాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
-జాల విష్ణు, కోయగూడెం
ఇక్కడి నేలలు సారవంతమైనవి..
భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని అన్ని ప్రాంతాల్లోనూ సారవంతమైన నేలలున్నాయి. నల్ల రేగడి, ఎర్ర నేలలు అధికం. దీనికి తోడు ఇటీవల కాలంలో రైతులు కూడా డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది కూరగాయ పంటల సాగు పెరిగింది. పందిళ్లు వేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది. రైతులు దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
-అన్నపూర్ణ, మండల వ్యవసాయ అధికారి, టేకులపల్లి
బోడ కాకర సాగు పెంచాలి..
బోడకాకర సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తున్నాయి. పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. బోడకాకర కాయల్లో మంచి ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటారు. అలాగే మార్కెట్లో డిమాండ్ కూడా ఉంది. రైతులు ఉద్యాన పంటలను సాగు చేయాలి. బోడ కాకర సాగును మరింత పెంచాలి.
-మరియన్న, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి, భద్రాద్రి