సారపాక, జూలై 10: గోదావరి వరదలు, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా అధికారులు పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, సీసీఎల్ఏ డైరెక్టర్, వరద సహాయక చర్యల ప్రత్యేకాధికారి రజత్కుమార్శైనీ ఆదేశించారు. మంగళవారం వారు పారిశ్రామికవాడ సారపాకలో పలు కాలనీల్లో పర్యటించి పంచాయతీ సిబ్బంది చేస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం వరద బాధితుల ఇళ్లకు వెళ్లి వారికి పలు సూచనలు చేస్తూ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
వరద ముంపు తగ్గిన తర్వాత అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు కాచిచల్లార్చిన నీటిని తాగాలని, ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. పారిశుధ్య సిబ్బంది రహదారులు, డ్రైనేజీల వద్ద బ్లీచింగ్ చల్లడంతోపాటు దోమల మందును పిచికారీ చేయించాలని, రోడ్లన్నీ శుభ్రం చేసి పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఈవో కంది మహేశ్, పంచాయతీ పారిశుధ్య సిబ్బంది ఉన్నారు.