ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 17 : ఖమ్మం నగరంలో ఆదివారం నాలుగు కేంద్రాల్లో నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నాలుగు కేంద్రాల్లో 2,587 మంది విద్యార్థులకు 72 మంది గైర్హాజయ్యారు. 97.21 హాజరుశాతం నమోదైంది. నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలో 919 మంది, కేంద్రీయ విద్యాలయ కేంద్రంలో 419మంది, వీవీసీ పాఠశాల కేంద్రంలో 343 మంది, ఎస్వీఎం పాఠశాల కేంద్రంలో 834 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్సీ బోర్డు నుంచి ఇద్దరు ప్రతినిధులు పర్యవేక్షించారు.
బోర్డు ప్రతినిధుల పర్యవేక్షణ…
బోర్డు నుంచి నలుగురు ఫ్లయింగ్ స్కాడ్స్, ఐదుగురు అబ్జర్వర్స్, కోఆర్డినేటర్ పార్వతిరెడ్డి పరీక్షల తీరును పర్యవేక్షించారు. ఈ దపా ప్రశ్నాపత్రాల బాక్స్‌లకు డిజిటల్ లాకింగ్ సిస్టమ్ అమర్చారు. పరీక్షా కేంద్రాల్లో ఎన్టీఏ ఇచ్చిన గడియారాలు అమర్చారు. నిమిషం నిబంధనల అమలులో ఉండడంతో గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.
క్షుణ్ణంగా తనిఖీలు…
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. చెవుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయా..? శరీర భాగాల్లో ఏమైనా కాఫియింగ్కు అనువుగా ఉండే పరికరాలు ఉన్నాయోమో అని తనిఖీ చేశారు.
వీడియో రికార్డింగ్…
పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు కేంద్రంలోకి అడుగు పెడుతున్న సమయం నుంచి వీడియో రికార్డింగ్‌ను అమలుపర్చారు. హాల్‌టిక్కెట్‌లో ఉన్న విద్యార్థి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి ఒకరేనా అనే అంశంలో తనిఖీలు చేయడంతో పాటు ప్రవేశ ద్వారం వద్ద నుంచే రెండు కెమెరాలతో వీడియో తీయించారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులను వీడియో రికార్డింగ్ తీయించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు పరీక్షల కో-ఆర్డినేటర్ పార్వతిరెడ్డిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) అభినందించింది.
భద్రాద్రి జిల్లాలో..
కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూలై 17: కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, పాల్వంచలోని డీఏవీ మోడల్ స్కూల్లో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. డీఏవీ మోడల్ స్కూల్లో 576 మందికి 546 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో 224 మందికి 201 మంది హాజరయ్యారు. డీఏవీ పాఠశాల కేంద్రం సూపరింటెండెంట్‌గా ప్రిన్సిపాల్ రామారావు, సీఎస్‌గా మహిళా కళాశాల ప్రిన్సిపాల్ శారద వ్యవహరించారు.