ఖమ్మం, జూలై 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ ఆదివారం భద్రాచలంలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు, ఉగ్రరూపం దాల్చిన గోదావరి వరదల ఏర్పడిన పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రానున్నారు. ఉదయం వరంగల్ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు. భద్రాచలంలో ఏరియల్ వ్యూ చేసి ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం భద్రాచలం పట్టణానికి చేరుకొని పునరావాస కేంద్రాలను పరిశీలిస్తారు. వరద ఉధృతితో జలమయమైన ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది.
అనంతరం గోదావరి కరకట్టను పరిశీలించనున్నారు. తరువాత భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్షిస్తారు. వరద ప్రభావం, ముంపు బాధితుల పరిస్థితులను రక్షించేందుకు తీసుకున్న చర్యలపై అధికారులతో చర్చిస్తారు. వరద నివారణకు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి సమీక్షించనున్నారు. ఉదయం 7:30 గంటలకు భద్రాచలం చేరుకునే అవకాశం ఉండడంతో మంత్రి అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సీ డాక్టర్ వినీత్ నేతృత్వంలో బారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.