మామిళ్లగూడెం, జూలై 15 : దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించి ఆర్ధికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియపై కలెక్టర్ అధికారులతో సమీక్షించి మాట్లాడారు. చింతకాని మండలంలో 3418 మంది లబ్ధిదారులకు గాను ఇప్పటి వరకు 3381 యూనిట్లను మంజూరు చేశామని తెలిపారు. దీనితో పాటు జిల్లాలోని ఐదు నియోకవర్గాలకు గాను 454 మంది లబ్ధిదారులకు గాను 451 యూనిట్లను మంజూరు చేశామన్నారు. డైయిరీ యూనిట్లలో చర్యలు వేగవంతం చేయాలని, పాడి గేదెల సమీకరణకు పశువైద్యాధికారులను పంపాలని తెలిపారు. కిరాణ, మెడికల్ షాపులు ఇంకా గ్రౌండింగ్ కాని వాటి విషయంలో వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఎక్స్ రే, ఎండోసోపీ పరికరాల యూనిట్ల వారికి సంబంధిత పరికరాలు త్వరితగతిన అందేలా చూడాలన్నారు. సమీక్షలో యూనిట్ల వారీగా గ్రౌండింగ్ లక్ష్యం, ప్రగతిని సమీక్షించారు. గ్రౌండింగ్ ప్రక్రియలో క్రియాశీలకంగా అధికారులు పని చేయాలని, లక్ష్యం త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జడ్పీ సీఈవో అప్పారావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.శ్రీరామ్, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతీ, డీఆర్డీవో విద్యాచందన, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి అజయ్‌కుమార్, డీఏవో విజయనిర్మల, పీఆర్ ఈఈ శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుమనోహర్ పాల్గొన్నారు.
క్రమద్ధీకరణ చర్యలు చేపట్టాలి
వివిధ సంక్షేమ శాఖలకు సంబంధించిన విద్యాసంస్థలు ఒక ప్రదేశానికి మంజూరై, మరో ప్రదేశంలో నిర్వహించబడుతున్నాయని, వీటిని ఆయా ప్రదేశాల్లోనే నడిచేలా క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షలో మాట్లాడుతూ విద్యను అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విద్యాసంస్థల కొరతతో డ్రాప్ అవుట్లు పెరుగుతున్నట్లు ఉన్న విద్యా సంస్థలను క్రమబద్ధీకరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవోలు సూర్యనారాయణ, రవీంద్రనాథ్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి సత్యనారాయణ, డీఈవో యాదయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమూది, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జ్యోతి పాల్గొన్నారు.
డ్రైడేను పకడ్బందీగా నిర్వహించాలి
సీజనల్ వ్యాధుల నియంత్రణకు డ్రైడే కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ రఘునాథపాలెం మండల అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంచుకొండ లో జరుగుతున్న డ్రైడే కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చునని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ వాంకుడోతు విజయ, ఉపసర్పంచ్ తేజావత్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.