ఖమ్మం/ రఘునాథపాలెం/ ఇల్లెందు, జూలై 14: కేంద్రం మోటరు వాహనాలపై తీసుకొచ్చిన 714 జీవోను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. ఖమ్మం జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రస్మా రాష్ట్ర నాయకుడు సూరపనేని శేషుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా రవాణాశాఖ అధికారి తోట కిషన్‌రావు, మోటరు వెహికిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్‌లను కార్యక్రమానికి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇల్లెందులో..
జీవో 714 రద్దు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఫిట్నెస్ పెనాల్టీ మినహాయింపునకు సహకరించిన మంత్రి అజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జీవో రద్దు వల్ల వాహనదారులందరూ హర్షం వ్యక చేస్తున్నారన్నారు.
ఖమ్మంలో ఆటో కార్మికుల ర్యాలీ
జీవో 714 రద్దు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఖమ్మంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు గురువారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకొని సీఎం కేసీఆర్, మంత్రి అజయ్‌కుమార్‌లకు ధన్యవాదాలు తెలుపుతూ వారి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పటేల్ సేడియం వద్ద మొదలైన ఆటోల ర్యాలీ వైరా రోడ్డు మీదుగా కాల్వొడ్డు వరకు కొనసాగింది.