మామిళ్లగూడెం, జూలై 14: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, గైనకాలజిస్టులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నెలకు కనీసం 250 ప్రసవాలు జరగాలని, అన్ని ప్రభుత్వ అసుపత్రుల్లో నెలకు వెయ్యికి పైగా ప్రసవాలు జరిగే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,603 సాధారణ, 1,264 ఆపరేషన్ కలిపి మొత్తం 2,867 ప్రసవాలు జరిగినట్లు వివరించారు. ఆసుపత్రుల్లో రాత్రిపూట విధులు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ప్రసవానంతరం పిల్లల వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్క కేసును కూడా తిరస్కరించవద్దన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, పీవో ఎంసీహెచ్ డాక్టర్ సైదులు, ఆర్ఎంవో డాక్టర్ శ్రీనివాసరావు, పర్యవేక్షకులు డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ అనిల్ పాల్గొన్నారు.
ట్రాన్స్జెండర్లు గుర్తింపు సర్టిఫికెట్లు పొందాలి
జిల్లాలోని ట్రాన్స్జెండర్లందరూ గుర్తింపు సర్టిఫికెట్లు పొందాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులు, ట్రాన్స్జెండర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సీడీపీవో, ఏడబ్ల్యూటీ, మెప్మాల సహకారంతో 75 మంది ట్రాన్స్జెండర్లను గుర్తించామన్నారు. ట్రాన్స్జెండర్లందరూ http;//trangender.dosje.gov.in అనే వెబ్సైట్లో వారి వివరాలు నమోదు చేసుకొని గుర్తింపు సర్టిఫికెట్లు పొందాలని సూచించారు. ఆధార్ కార్డు లేని వారికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి ఆధార్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ విచారణ చేపట్టి కమ్యూనిటీ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సొంత నివాస స్థలం ఉన్నవారికి ఆ స్థలంలోనే ఇంటి నిర్మాణానికి వచ్చే ఆర్థిక చేయూత పథకం అమలులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. ధ్రువీకరణ పొందిన తర్వాత వివిధ శాఖలతో చేపట్టే సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులుగా చేర్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్ మొగిలి స్నేహలత, డిఆర్వో శిరీష, జడ్పీ సీఈవో అప్పారావు, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్, డీడబ్ల్యూవో సంధ్యారాణి, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, ఎస్సీడీడబ్ల్యూ డీడీ కస్తాల సత్యనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.