ఖమ్మం, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మంగళవారం ఖమ్మం రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. ఆ గ్రామంలో చెరుకూరి రామారావు ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నట్లు తెలుసుకున్న ఆయన.. మంగళవారం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలను వెంటబెట్టుకొని సూర్యాపేట నుంచి నేరుగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో సాగు విధానాలను స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో కోయచలక వచ్చినట్లు తెలిపారు. క్షేత్రంలో సాగవుతున్న వివిధ రకాల కూరగాయలను పరిశీలించారు. రైతు చెరుకూరి రామారావు వ్యవసాయ క్షేత్రంలో చేస్తున్న ఆర్గానిక్ ఎరువుల తయారీ విధానాన్ని కూడా పరిశీలించారు.
‘ఆర్గానిక్ ఎరువుల తయారీకి ఏమి వినియోగిస్తున్నారు? ఎన్ని రోజుల సమయం పడుతుంది?’ అనే అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు గంటలపాటుక్షేత్రం మొత్తం కలియతిరిగారు. సుమారు 20 ఎకరాల్లో 20కి పైగా పంటలను సాగు చేస్తున్న రైతు రామారావును అభినందించారు. ఆదివారం తమ జిల్లాలోని రైతులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసే విధానంపై తమ జిల్లా రైతులకు అవగాహన కల్పించేందుకు సూర్యాపేట రావాలని రైతు రామారావును మంత్రి కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి వచ్చినట్లు తెలుసుకున్న కోయచలక, రేగులచలక గ్రామాల ప్రజాప్రతినిధులు రావడంతో వారితో కాసేపు ముచ్చటించారు. తిరుగుపయనంలో కోయచకలక సర్పంచ్ మాదంశెట్టి హరిప్రసాద్ ఇంటికి వెళ్లి కాసేపు కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. టీఆర్ఎస్ నాయకులు నున్నా శ్రీనివాసరావు, తోట వెంకట్ తదితరులు పాల్గొన్నారు.