ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 12 : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఎంసెట్-2022 ప్రవేశ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించే పరీక్షకు సంబంధించి ఎంపిక చేసిన ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14, 15వ తేదీల్లో ఇంటర్ బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులకు అగ్రికల్చర్ పరీక్ష, 18, 19, 20వ తేదీల్లో ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లపాటు జరుగనున్న పరీక్షకు ఇంజినీరింగ్ విభాగంలో 11,010 మంది, అగ్రికల్చర్ విభాగంలో 7340 మంది హాజరుకానున్నట్లు రీజనల్ కో-ఆర్డినేటర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ పద్మావతి తెలిపారు.
జిల్లాలో 6 కేంద్రాలు
ఖమ్మం నగరంలోని కిట్స్, డేర్, ఎస్బీఐటీ, బొమ్మ, విజయ, ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష నిర్వహించనున్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలో అనురాగ్, సనా, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల్లో నిర్వహించనున్నారు. సెషన్-1ని ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సెషన్-2ని మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నారు. సుమారు గంటన్నర ముందుగా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. నిమిషం నిబంధన అమల్లో ఉందని, తమకు కేటాయించిన కంప్యూటర్లో లాగిన్ అయ్యేందుకు ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రానికో అబ్జర్వర్ను నియమించినట్లు పద్మావతి తెలిపారు.