
ఖమ్మం కల్చరల్/కొత్తగూడెం కల్చరల్ నవంబర్ 18: అఖండ దీపారాధనలతో కార్తీక పౌర్ణమి వేనవేల కాంతులతో దేదీప్యం కానుంది. పున్నమి వెన్నెలకు తోడు వేనవేల దీపాల దొంతరల కాంతులు, విద్యుత్ దీపాల వెలుగులు, భక్త కోటి ఆధ్యాత్మిక, భక్తి సౌరభాలతో కార్తీకపౌర్ణమి పర్వమంతా కాంతిమయం కానుంది. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీకమాసం శుక్రవారం కార్తీక పౌర్ణమి పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించుకోనున్నారు. పౌర్ణమి తిథి శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఉండడంతో తిథితోపాటు రాత్రి వేళల్లో గల పున్నమి ప్రాధాన్యంగా కార్తీకపౌర్ణమి పండుగను భక్తి ప్రపత్తులతో జరుపుకోనున్నారు. ఈ మేరకు శైవ, వైష్ణవ క్షేత్రాల్లోని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అధిక సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి తమ తమ ఇష్టదైవాలను దర్శించుకుని దీపారాధన చేయనున్నారు. సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం దక్కేవిధంగా ఈ రోజున 365 వత్తులను వెలిగించనున్నారు. దీంతో సంవత్సరంలో ఏ ఒక్క రోజు దీపం పెట్టలేని పరిస్థితి వచ్చినా.. 365 వత్తుల దీపారాధనలతో పరిహారం అవుతుందని భక్తుల నమ్మకం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్తీక కాంతులతో ఆలయాలు వెలుగులీననున్నాయి. భద్రాచలంలోని గోదావరి నదిలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. కార్తీకమాసంలో నదీ స్నానం పుణ్యఫలాలనిస్తుందన్నది భక్తుల నమ్మకం.
మాలధారణల వేళలు..
మాలధారణ కోసం కార్తీకమాసానికి ఎంతో విశిష్టత ఉంది. అయ్యప్ప, కనకదుర్గ, సాయి, శివుడు, ఆంజనేయ స్వామి భక్తులు తమ ఇష్టదైవాల మాలలు ధరిస్తున్నారు. దీంతో ఆలయాల వద్ద రద్దీ పెరుగుతోంది.
కూసుమంచి శివాలయం ముస్తాబు
కాకతీయుల నాటి ప్రాచీన శివాలయం శుక్రవారం కార్తీకపౌర్ణమి ప్రత్యేక పూజలకు ముస్తాబైంది. ఆలయాన్ని పూలతో అలంకరించారు. శివలింగాకారం ఉన్న గర్భగుడిని ముస్తాబు చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు చేయనున్నారు.
జీళ్లచెరువులోని శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో కార్తీకపౌర్ణమి సందర్భంగా శుక్రవారం తెప్పోత్సవం నిర్వహిస్తారు. స్వామి వారిని ఊరేగించడానికి హంసవాహనాన్ని తయారు చేశారు.