అశ్వారావుపేట, జూలై 12 : ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు. పల్లె నుంచి పట్టణం స్థాయి వరకు సర్కార్ దవాఖానల్లో వైద్య సేవలను విస్తృతపరుస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందే ఖరీదైన వైద్య సేవలను క్రమక్రమంగా సర్కార్ దవాఖానల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మారుమూల బస్తీల్లో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 61 డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేయగా వీటి పరిధిలో 515 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. వీటిలో పూర్తి గిరిజన జిల్లా అయిన భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మణుగూరు ఏరియా ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. వీటిలో అశ్వారావుపేటలో రెండు యూనిట్లు, మణుగూరు ఆసుపత్రికి మూడు యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో కిడ్నీ బాధితుల కష్టాలు తీరనున్నాయి.
విజ్ఞప్తులకు స్పందన..
ఇటీవల ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి వినతి అందించారు. గిరిజన ప్రాంతంలో కేంద్రం ఏర్పాటు చేసి కిడ్నీ బాధితులకు అండగా నిలిచినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ప్రజల తరఫున ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గతంలో వ్యయ ప్రయాసలు..
ఒక మనిషి కిడ్నీలు ఫెయిల్ అయితే ఇక డయాలసిస్ చేయించుకోవడమే శరణ్యం. ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటారు. కానీ పేద, మధ్యతరగతి బాధితులు డయాలసిస్ చేయించుకోవడమంటే ఖర్చుతో కూడుకున్నది. నిర్ణీత సమయంలో డయాలసిస్ చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. కొన్నేళ్ల క్రితం బాధితులు డయాలసిస్ కోసం వ్యయ ప్రయాసల కోర్చి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రి వంటి పెద్దాసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ డయాలసిస్ ఉచితమైనప్పటికీ రవాణా ఖర్చులు భారంగా ఉండేవి. అర్ధరాత్రి స్వస్థలం నుంచి బయల్దేరితే నగరానికి చేరుకునే సరికి తెల్లారేది. కొత్తగూడెం, ఖమ్మంలోని డయాలసిస్ కేంద్రాలకు వెళ్లాలన్నా రవాణాఖర్చులు భారంగా ఉండేవి. కొత్తగూడేనికి ఒక మనిషిని పక్కన పెట్టుకుని రానుపోను రూ.వెయ్యి, ఖమ్మానికి అయితే రూ.2 వేల వరకు ఖర్చయ్యేవి. స్థానికంగా డయాలసిస్ సెంటర్లు అందుబాటులోకి తీసుకురావడంతో వారి కష్టాలు తీరాయి. సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి.
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం..
కిడ్నీ బాధితుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి డయాలసిస్ కేంద్రం మంజూరు చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును కోరాం. వెంటనే స్పందించిన మంత్రి డయాలసిస్ కేంద్రం మంజూరు చేయించారు. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని వసతులు ఉన్నాయి. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకోవద్దు. – మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే
రెండు డయాలసిస్ సెంటర్లు మంజూరు..
జిల్లాకు రెండు డయాలసిస్ సెంటర్ల మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ జీవో జారీ చేసింది. అశ్వారావుపేట సీహెచ్‌సీ ఆసుపత్రి, మణుగూరు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. గతంలో ఆయా ప్రాంతాలకు చెందిన కిడ్నీ బాధితులు డయాలసిస్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వారి కష్టాలు తీరుతాయి. అశ్వారావుపేట, మణుగూరు ఆస్పత్రుల్లోనే వారు డయాలసిస్ చేయించుకోవచ్చు.
– డాక్టర్ ముక్కంటేశ్వరరావు, డీసీహెచ్ఎస్, కొత్తగూడెం