సత్తుపల్లి/పెనుబల్లి/తల్లాడ/కూసుమంచి/వైరా రూరల్/ కామేపల్లి/తిరుమలాయపాలెం, జూలై 11: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు 14.2 అడుగుల మేర నీటిమట్టం చేరింది. పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టుకు భారీ నీరు చేరుతుండడంతో ఎస్ఐ సూరజ్ ప్రాజెక్టును సందర్శించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, సందర్శకులను అనుమతించ వద్దని సూచించారు. తల్లాడ మండలంలోని అన్ని గ్రామాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
కూసుమంచి మండలంలో ఈ నెల 1 నుంచి 10 వరకు 420 మి.మీ వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. వైరా రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరి నిండి నిండుకుండను తలపిస్తున్నది. సిరిపురం, పుణ్యపురం, లక్ష్మీపురం గ్రామాల మధ్య చప్టాపై నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆర్అండ్బీ డీఈ దేవికాచౌహాన్ లక్ష్మీపురం వెళ్లి చప్టా పరిసరాలను సందర్శించి సూచనలు ఇచ్చారు. కామేపల్లి, పాతలింగాల, కొండాయిగూడెం పెద్ద చెరువులు మత్తడి పోస్తున్నాయి. బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. తిరుమలాయపాలెం మండలంలో 11 మైనర్ ఇరిగేషన్ చెరువులు 57 నోటిఫైడ్ చెరువులు, 33 నాన్ నోటిఫైడ్ కుంటలు ఉండగా 80 శాతం చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి.
21 అడుగలకు చేరిన పాలేరు నీటిమట్టం
కూసుమంచి, జూలై 11: పాలేరు నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతున్నది. పూర్తిస్థాయిలో నిండేందుకు మరో 2 అడుగులు మాత్రమే ఉంది. సోమవారం రాత్రికి రిజర్వాయర్ నీటిమట్టం 21 అడుగులకు చేరుకోనున్నది. ఎగువన పడుతున్న వర్షాలతో రిజర్వాయర్‌కు 3,795 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పాలేరు పూర్తి స్థాయి నీటిమట్టం 23 అడుగులు.
వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
మధిరటౌన్, జూలై 11: రెండు, మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. సోమవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో శివాలయం వద్ద వైరానది ఉధృతిని ఆయన టీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాగులు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు.
వైరారూరల్, జూలై 11: వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పేర్కొన్నారు. ఆయన ప్రభుత్వం యంత్రాగంతో ఫోన్లో మాట్లాడారు. అన్ని శాఖల నుంచి ఈ తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాలని సూచించారు.