ఖమ్మం, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గోదావరి వరదల నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ముంపువాసులకు పునరావాస చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయన ‘నమస్తే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. ఎలాంటి పరిస్థితులలైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సోమవారం సాయంత్రానికి ప్రవాహం 53 అడుగులకు చేరుకుందని, ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక అమలవుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయన్నారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.
నమస్తే : గోదావరి ఉధృతి ఎలా ఉంది ?
మంత్రి : భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తున్నది. ఆదివారం రాత్రి 43 అడుగులకు చేరడంతో కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం సాయంత్రానికి 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం సాయంత్రం నుంచి వరద ప్రవాహం క్రమేణా తగ్గుముఖం పడుతున్నది. సోమవారం అర్ధరాత్రి వరకు వరద ఉధృతి నిలకడగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాం. వరద ఉధృతి ఏ విధంగా ఉన్నా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది.
నమస్తే : పునరావాస చర్యలు ఎలా కొనసాగుతున్నాయి?
మంత్రి : భద్రాచలం ప్రాంతంలో ముంపునకు గురయ్యే గ్రామాలను అధికారులు ముందే గుర్తించారు. అక్కడి వారిని అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాం. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక పునరావాస చర్యలను పరిశీలిస్తున్నారు. పునరావాస శిబిరంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక అమలులో ఉన్నందున అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. సీఎం ఆదేశాల మేరకు సోమవారం రాత్రి భద్రాచలంలోనే బస చేశా. గంట గంటకు అధికారులను సమీక్షించా.
నమస్తే : ఏజెన్సీలో రాకపోకలు ఎప్పుడు పునః ప్రారంభమవుతాయి?
మంత్రి : భద్రాచలం, వెంకటాపురం, ఛత్తీస్‌గఢ్ ప్రధాన రహదారిపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆయా ప్రాంతాల్లో వాహన రాకపోకలు స్తంభించాయి. ప్రజలు ఆ మార్గం గుండా ప్రయాణించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశాం. ఆర్టీసీ బస్సులే కాదు ఎలాంటి వాహనాలనూ అటువైపు అనుమతించడం లేదు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే రాకపోకలను పునరుద్ధరిస్తాం.
నమస్తే : ఉమ్మడి జిల్లాలో వానల ప్రభావం ఎలా ఉంది?
మంత్రి : ఉమ్మడి జిల్లాలో వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ముంపు గ్రామాలకు చెందిన ప్రజలకు నిత్యావసర సరుకులు, మెడిసిన్ అందుబాటులో ఉంచాం. ఖమ్మం నుంచి ప్రవహిస్తున్న మున్నేరును స్వయంగా పరిశీలించాను. ముంపువాసులకు నగరంలోని నయాబజార్ కళాశాలలో పునరావాస శిబిరం ఏర్పాటుచేశాం. మరోవైపు వానలు బాగా కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతుబంధు అందడంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
నమస్తే : వరద ఉధృతి ఎన్ని అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంది?
మంత్రి : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వ ర్షాల కారణంగా సోమవారం 53 అడుగులకు ప్రవాహం చేరుకున్నది. రాత్రి వరకు 55 అడుగులకు చేరే అవకాశం ఉంది. అక్కడి నుంచి క్రమం గా వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం నాటికి మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉంది. భద్రాచలం వరద పరిస్థితులపై మూడు నెలల కిందటే సమీక్ష నిర్వహించాం. అధికారులను అప్రమత్తం చేశాం. కరకట్టపై ఉన్న స్లూయీజ్ లీక్‌లను పరిశీలించి మరమ్మతులు నిర్వహించాం. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణం ఆవరణలో గతంలో కంటే ఈసారి వరద తక్కువగానే చేరింది.