మామిళ్లగూడెం,జూలై11: సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణ పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ఇంజినీరింగ్ అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. పనులు ఎటువంటి అంతరాయం లేకుండా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లుల చెల్లింపుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎన్.మధుసూదన్, ఆర్ఎండ్బీ ఎస్ఈ లక్ష్మణ్, ఈఈ శ్యాంప్రసాద్, డీఈ చంద్రశేఖర్, జేఈ విశ్వనాథ్ పాల్గొన్నారు. అనంతరం దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. గ్రౌండింగ్ పురోగతిపై కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వార్షిక రుణ లక్ష్యాలను సాధించాలి : కలెక్టర్
మామిళ్లగూడెం, జూలై11: వార్షిక రుణ లక్ష్యాల మేరకు ప్రగతి సాధించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఈ ఏడాది క్రెడిట్ ప్లాన్ లక్ష్యంలో ఇప్పటికే 45.54 శాతం ప్రగతి సాధించామన్నారు. బ్యాంక్ లింకేజీ రుణాల విషయంలో బ్యాంకర్లకు సూచించిన లక్ష్యాలు సాధించేలా చూడాలన్నారు. రుణాలు తిరిగి వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రుణాలు తిరిగి చెల్లింపులు సక్రమంగా చేస్తున్న స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలన్నారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఆర్డీవో విద్యాచందన, ఇంచార్జీ ఎల్డీఎం ప్రేమ్‌చంద్, అదనపు డీఆర్డీవో జయశ్రీ, డీపీఎం రేవతి, స్త్రీనిధి ఆర్ఎం రవీందర్‌నాయక్, మేనేజర్ ఆనంద్‌కుమార్, బ్యాంకర్లు పాల్గొన్నారు.