గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం వద్ద వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నది. ఆదివారం అర్ధరాత్రి 43 అడుగులకు నీరు చేరుకోవడంతో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు 53 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో కలెక్టర్ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కేవలం 24 గంటల్లోపు మూడు ప్రమాద హెచ్చరికలను జారీ చేయడం దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారి. వరద ఉధృతి పెరుగుతుండడంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు. గోదావరి కరకట్ట, ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముంపు బాధితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. వరద ఉధృతి పెరుగుతుండడంతో భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం వెళ్లే ప్రధాన మార్గంలోని ఎటపాక, తూరుబాక, గంగోలు రహదారిపై వరద నీరు ప్రవహిస్తున్నది. పట్టణానికి చెందిన 300 మంది ముంపు ప్రాంత వాసులను పట్టణంలోని నన్నపనేని మోహన్ పాఠశాలతోపాటు పలు పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఖమ్మం, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఆదివారం అర్ధరాత్రి 43 అడుగులకు చేరుకోవడంతో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు 53 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో కలెక్టర్ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కేవలం 24 గంటల్లోపు మూడు ప్రమాద హెచ్చరికలను జారీ చేయడం దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. వరద ఉధృతి పెరుగుతుండడంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హుటాహుటిన భద్రాచలం పట్టణానికి చేరుకున్నారు. గోదావరి కరకట్ట ప్రాంతం, ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముంపు బాధితులకు తక్షణం పునరావాసం కల్పించాలని ఆదేశించారు.

రాకపోకలు బంద్..
గోదావరి వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతుండడంతో భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధానమార్గంలోని ఎటపాక, తూరుబాక, గంగోలు రహదారిపై వరద నీరు ప్రవహిస్తున్నది. భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే మార్గంలో నెల్లిపాక రహదారిపై మోకాలు లోతు నీరు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు భద్రాచలంలోని 300 మంది ముంపు ప్రాంతవాసులను పట్టణంలోని నన్నపనేని మోహన్ పాఠశాలతో పాటు పలు పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కరకట్ట వద్ద గోదావరి వరదనీరు స్లూయీజ్‌ల నుంచి వరద లీక్ కాకుండా రెండు నెలల క్రితమే ముందస్తు చర్యలు చేపట్టడడంతో పట్టణానికి వరద ముప్పు తప్పింది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి అజయ్‌కుమార్
మంత్రి అజయ్‌కుమార్ భద్రాచలంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావుతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినా ప్రజలు ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు తక్షణ సహాయ, పునరావాస చర్యలు చేపడతారన్నారు. ముంపు ప్రాంతాల్లో రవాణాను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి పువ్వాడకు సీఎం ఫోన్….
భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వరద సహాయక చర్యలపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ సమయంలో మంత్రి అజయ్‌కి కాల్ చేశారు. భద్రాచలంలో వరద పరిస్థితిపై ఆరా తీశారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున సోమవారం భద్రాచలంలోనే బస చేయాలని మంత్రికి సూచించారు. రాత్రి వరకు వరద ప్రవాహం 55 అడుగుల వరకు చేరుకుని క్రమేణా తగ్గుముఖం పడుతుందని అధికారులు భావిస్తున్నారు.