ఖమ్మం, జూలై 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితబంధు పథకం ఎస్సీ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల విలువైన యూనిట్లు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నది.. నిన్న మొన్నటి వరకు కూలీ పనులకు వెళ్లిన వారు ఇప్పుడు యజమానులుగా మారారు. మరికొన్ని కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన చింతకాని మండలంతో పాటు మరికొన్నిచోట్ల అధికారులు విజయవంతంగా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 2,767 మంది లబ్ధిదారుల 1,273 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయింది. 548 డెయిరీ యూనిట్లు మంజూరు కాగా ఈ నెలలో గ్రౌండింగ్ పూర్తి కానున్నది. త్వరలో లబ్ధిదారులకు యూనిట్లు అందనున్నాయి.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు.ఆయా కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయాన్ని ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు కూలి పనులకు వెళ్లిన వారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి యూనిట్లు పొంది ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. కుటుంబాలను పోషించుకుంటున్నారు.
పిల్లలను చదివించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చింతకాని మండలం దళితబంధుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కాగా జిల్లాలోని మరికొన్నిచొట్ల పలువురు లబ్ధిపొందారు. ఇప్పటివరకు 2,767 మంది లబ్ధిదారులకు 1,273 యూనిట్లకు గ్రౌండింగ్ పూర్తయింది. వీటిలో 48 సెంట్రింగ్ యూనిట్లు, 19 డీటీపీ, జిరాక్స్, 44 డీజే, 36 ఫొటో, వీడియో స్టూడియో, రెండు ఎజాక్స్, 11 టైలరింగ్, 12 అల్యూమినియం వెజల్స్, ఒక మినీ రైస్ మిల్, 80 జేసీబీలు, 41 హార్వెస్టర్లు, ఐదు ట్రాలీ ఆటోలు, 11 డ్రోన్ స్ప్రెయర్లు, ఒక అంబులెన్స్, నాలుగు మొబైల్ టిఫిన్ సెంటర్లు, 94 మినీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఆరు గొర్రెల యూనిట్లు ఉన్నాయి. 548 డెయిరీ యూనిట్లు మంజూరు కాగా పాడి గేదెల సీజన్ దృష్ట్యా జూలై రెండో వారంలో డెయిరీ యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మరో నలుగురికి ఉపాధి..
చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన గుంటక ప్రభాకర్, గుంటక అరుణ దంపతులు బట్టలు కుడుతూ జీవనం సాగించేవారు. ఇంట్లో ఉన్న ఒకే మిషన్ ఉండడంతో నెలకు కేవలం రూ.7 వేల నుంచి రూ.8 వేల ఆదాయం వచ్చేది. దళితబంధు పథకంలో భాగంగా వీరికి అధునాతనమైన నాలుగు కుట్టుమిషన్లు, రెండు ఓవర్‌లాక్, జిగ్‌జాగ్ మిషన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వీరు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాదు నెలకు రూ.వేలల్లో ఆదాయం పొందుతున్నారు.
డ్రైవర్ నుంచి ఓనర్ దాకా..
ప్రొద్దుటూరుకు చెందిన గుంటక తిరుమల్‌రావు డ్రైవర్‌గా పని చేసే వాడు. నెలకు 10 వేల ఆదాయమైనా వచ్చేది కాదు. దళితబంధులో భాగంగా తిరుమల్‌రావుకు మహీంద్రా ట్రాన్స్పోర్ట్ వాహనం మంజూరైంది. ఇప్పుడు లబ్ధిదారుడు నెలకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు సంపాదిస్తున్నాడు.
దారి చూపిన ‘సెంట్రింగ్ యూనిట్’
నాగిలిగొండకు చెందిన ఏలియా గతంలో సెంట్రింగ్ మేస్త్రీగా పనిచేసే వాడు. ప్రతిరోజు అడ్డాకు వెళ్లి పని కోసం వేచిచూసే వాడు. పని దొరికని రోజు ఖాళీ ఉండాల్సి వచ్చేది. పని చేసినా రోజుకు రూ.400- రూ.500 వరకు మాత్రమే ఆదాయం వచ్చేది. దళితబంధులో భాగంగా ఏలియాకు సెంట్రింగ్ యూనిట్ మంజూరైంది. యూనిట్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.75 వేల ఆదాయాన్ని ఆర్జించాడు.
ఉపాధికి మార్గాలు..
చింతకాని మండలం నాగిలిగొండ చెందిన చాట్ల సురేశ్, చాట్ల నాగరాజు, చాట్ల వెంకటేశ్వర్లు గతంలో బిల్డింగ్ రాడ్ బైండింగ్ పని చేసేవారు. రవాణా ఖర్చులు పొను రోజుకు రూ.300 నుంచి 400 సంపాదించేవారు. కొన్నిసార్లు వారికి పని దొరక్కపోయేది. దళితబంధు పథకంలో భాగంగా మూడు యూనిట్లకు ఒక హార్వెస్టర్ మంజూరైంది. హర్వేస్టర్ ఇప్పటి వరకు 60 గంటలు పని చేసిందని, ఖర్చులు పోను రూ.90 వేల వరకు ఆదాయం వచ్చిందని వా రు తెలిపారు. ఇదేగ్రామానికి చెందిన మారాపురం కుటుంబరావు, మారాపురం జయరాం, మారాపురం శ్రీనివాసరావు వ్యవసాయ కూలీలు. సమష్టి అంగీకారంతో మూడు యూనిట్లకు వీరికి జేసీబీ మంజూరైంది. ఇప్పటివరకు జేసీబీ 450 గంటలు పని చేసింది. ఖర్చులు పొను రూ.3 లక్షల వరకు నికర ఆదాయం వచ్చింది. ఈ చొప్పున ముగ్గురికి రూ.లక్ష చొప్పున ఆదాయం వచ్చినట్లు లెక్క.