
ఖమ్మం, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర రైతన్నల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కేంద్రంపై పోరు సాగిస్తున్నామని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతుండడాన్ని నిరసిస్తూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద గురువారం జరిగిన రైతుమహాధర్నాకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు హాజరయ్యారు. ఇందులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. భుజాన నాగలి, మెడలో వరి కంకులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తూ అన్నదాతల నడ్డి విరుస్తోందని అన్నారు. కర్షకుల కష్టాలు ప్రస్ఫుటించేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎమ్మెల్యే సండ్రను సీఎం కేసీఆర్ అభినందించారు.
వడ్లు కొనాల్సిందే: ఎమ్మెల్యే వనమా
తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం ప్రభుత్వం కొనాల్సిందేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ మహాధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్రం మొండి వైఖరి నశించాలని నినదించారు. కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్ హాజరయ్యారు. మంత్రి అజయ్‌కుమార్‌తో వారు కలిసి వెళ్లారు. ప్లకార్డులు పట్టుకొని ధర్నాలో కూర్చున్నారు.
కేంద్రానిది నిరంకుశ ధోరణి: హరిప్రియ
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ దుయ్యబట్టారు. హైదరాబాద్ రైతు ధర్నాలో ఆమె మాట్లాడుతూ కేంద్రం వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తాము పోరాడుతున్నామని అన్నారు.
మహాధర్నాలో ఖమ్మం గళం
యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్ర రాజధానిలో జరిగిన మహాధర్నాకు టీఆర్ఎస్ జిల్లా నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పాల్గొన్న ఈ ధర్నాలో మంత్రి అజయ్‌కుమార్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియానాయక్, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములునాయక్, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు ఖమర్, దిండిగాల రాజేందర్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్, అజయ్‌కుమార్‌తో కూడిన మంత్రుల బృందం గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం అందజేసింది.
రైతుల ఉనికిని దెబ్బ తీసేలా..
‘రైతుల ఉనికి, అస్థిత్వాన్ని దెబ్బ తీసేలా చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్ర ప్రభుత్వం మహా ధర్నాను చేపట్టింది. రైతుల కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది రెండు పార్టీలకు మధ్య ఉన్న వైరం కాదు, యావత్ తెలంగాణ రైతాంగానికి సంబంధించినది.భూమినే నమ్ముకున్న రైతులకు భరోసాను ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇదే విషయమై సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినా ఫలితం లేకపోవడం వల్లే రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పేందుకే మహా ధర్నాను తలపెట్టాం. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్రం బాధ్యత, కానీ ఆ బాధ్యతను కేంద్రం విస్మరిస్తోంది. కేంద్రానికి కనువిప్పు కలిగేలా సీఎం కేసీఆర్ స్వయంగా మహాధర్నాలో పాల్గొని రైతులకు అండగా నిలిచారు.’
-సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే