మామిళ్లగూడెం, జూలై 10 : జిల్లాలో భారీ వర్షాల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలతో ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు వివరించారు. పొంగుతున్న వాగులు, నిండి ఉన్న చెరువుల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని, నీటి ప్రవాహం ఉన్న వంతెనలు, రోడ్ల వద్ద రాకపోకలు నిలిపి వేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.
పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 1077, 9063211298లను సంప్రదించాలని, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ సురభి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీపీవో హరిప్రసాద్, టీఎస్ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సురేందర్, రెవెన్యూ డివిజన్ అధికారి రవీంద్రనాథ్, జిల్లా కోశాధికారి వి.సత్యనారాయణ, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీ శాఖల అధికారులు పాల్గొన్నారు.