మణుగూరు టౌన్, జూలై 10 : మణుగూరులో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం రాత్రి మణుగూరు పట్టణం నడిబొడ్డున అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు సీఎస్ఆర్ నిధులు రూ.2 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ కార్యాలయాలను కలుపుతూ సాగిన ఈ సెంట్రల్ లైటింగ్ డివైడర్ ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేదిగా నిలిచిపోతుందన్నారు. సింగరేణి యాజమాన్యం సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.2 కోట్లు అందించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకించి పట్టణాల సుందరీకరణపై కార్యాచరణ చేస్తుందని, అందులో భాగమే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.
మున్సిపాలిటీలు, పట్టణాల అభివృద్ధి విషయంలో అడుగడుగునా వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా రేగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు, అప్పారావు, సర్పంచులు బచ్చల భారతి, ఏనిక ప్రసాద్, నాయకులు తాళ్లపల్లి యాదగిరిగౌడ్, వట్టం రాంబాబు, బొలిశెట్టి నవీన్‌బాబు, జాన్ రామిడి రామిరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు జావీద్‌బాషా, ముద్దంగుల కృష్ణ, కొండేరు రాము, కటకం గణేశ్, యువజన సంఘం నాయకులు సాగర్‌యాదవ్, రమాదేవి, జి.కోటేశ్వరరావు, సుజాత, దండా రాధాకృష్ణ పాల్గొన్నారు.