సత్తుపల్లి, జూలై 10 : దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టి లబ్ధిదారుల ఖాతాలో నేరుగా రూ.10 లక్షలు వేసి దళితుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల పరిధిలోని కిష్టాపురంలో ఆదివారం దళితబంధు లబ్ధిదారులకు 25యూనిట్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మెదిలిన గొప్ప ఆలోచన దళితబంధు పథకమని, పర్వదినమైన తొలి ఏకాదశి నాడు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయడం శుభపరిణామమన్నారు. నియోజకవర్గంలో 100 యూనిట్లు మంజూరుకాగా తొలివిడతగా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో 75 యూనిట్లు, కిష్టాపురంలో 25 యూనిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
వీటిలో పది డెయిరీ యూనిట్లు, ఐదు అశోక్ లేల్యాండ్ వాహనాలు, రెండు సూపర్మార్కెట్లు, ఒక మొబైల్ టిఫిన్ సెంటర్ను అతిత్వరలో అందజేయనున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ అధికారులే పేదరికమే గీటురాయిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, యూనిట్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రూ.35 కోట్లతో సత్తుపల్లి ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీడీవో వీరేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గాదె సత్యం, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమావతి, సర్పంచ్ దరావత్ పుల్లమ్మ, ఎంపీటీసీ తుంబూరు కృష్ణారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు చిలుకుర్తి కృష్ణమూర్తి, మందపాటి వెంకటరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.