ఖమ్మం, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరుణుడు కరుణించాడు.. కుండపోతగా వర్షించాడు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం ప్రారంభమైన వర్షం శనివారం రాత్రి వరకు కొనసాగింది.. పొలాలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి.. భద్రాచలంలోని గోదావరి వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్నది. తాలిపేరు ప్రాజెక్టు, పాలేరు, వైరా రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఏజెన్సీలో జనజీవనం స్తంభించింది. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 33.2 మి.మీ వర్షపాతం, అత్యధికంగా రఘునాథపాలెం మండలంలో 54.02 మి.మీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 36.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా దుమ్ముగూడెం మండలంలో 105.4 మి.మీ వర్షపాతం నమోదైంది. సింగరేణి, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం ఏరియాల వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికారుల సమన్వయంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వానలు కొనసాగుతున్నాయి. గురువారం సాయంత్రం మొదలైన వాన కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం కాసింత తెరిపిచ్చినప్పటికీ మధ్యాహ్నానికి తిరిగి ఊపందుకున్నది. వరుసగా కురుస్తున్న వానలకు ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. ఏజెన్సీలో జనజీవనం స్తంభించింది. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 33.2 మిల్లీమీటర్ల వర్షపాతం, అత్యధికంగా రఘునాథపాలెం మండలంలో 54.02 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 36.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా దుమ్ముగూడెం మండలంలో 105.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వానలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు.
పెరుగుతున్న వరద ఉధృతి..
భద్రాచలంలోని గోదావరి వద్ద వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతున్నది. ఖమ్మం నగరాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మున్నేరులో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. పాలేరు రిజర్వాయర్‌కు ఎగువ నుంచి 6 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. వైరా రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటిమట్టం చేరుకున్నది. బుగ్గవాగు వరద ఉధృతి పెరగడంతో డోర్నకల్- లింగాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వాన నిరాటంకంగా కురుస్తుండడంతో మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం ఏరియాలవ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతున్నది. నీటి మట్టం బట్టి, వరద ఉధృతిని బట్టి ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు నీటిని దిగువకు వదులుతున్నారు. దుమ్మగూడెం మండలంలోని వాగులో శుక్రవారం ఓ మహిళ గల్లంతు కాగా శనివారం పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. మణుగూరు మండలంలోని కోడిపుంజుల వాగులో గల్లంతైన శంకర్ మృతదేహాన్ని గిరిజనులు గుర్తించారు.