ఖమ్మం, జూలై 9: బక్రీద్‌ను ఈద్ ఉల్ అజ్హాగా పేర్కొంటారు. ఖుర్బానీ అంటే సమర్పణ, త్యాగం, బలి అనే అర్థాలున్నాయి. సుమారు 4 వేల సంవత్సరాల క్రితం ఇరాక్‌లోని పండిత కుటుంబంలో జన్మించాడు దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సాలాం. ఒకరోజున దైవప్రవక్త ఇబ్రహీంకి ఒక కల వచ్చింది. 86 ఏళ్ల వృద్ధాప్యంలో జన్మించిన తన ఏకైక కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఖుర్బానీ చేయాలని అల్లాహ్ ఆదేశించినట్లు కల సారాంశం. అల్లాహ్ ఆదేశానుసారం తన కుమారుడిని బలి ఇవ్వడం కోసం ప్రయత్నించడం, అల్లాహ్ దాన్ని స్వీకరించి ఇస్మాయిల్ అలైహిస్సలాంకు బదులు స్వర్గం నుంచి ఓ పొట్టేలు (దుంబా)ను పంపి ఖుర్బానీ చేయడమే ఈ పండుగ ప్రత్యేకత. మానవ ఇతిహాసంలో కనీ వినీ ఎరుగని రీతిలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి.
అందులో భాగంగానే మహాప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం జీవితంలో జరిగినట్లు ప్రతీతి. తాత, ముత్తాతల కాలం నుంచి వస్తున్న దురాచారాలు, దుస్సంప్రదాయాలు, మూఢ నమ్మకాలను ఇబ్రహీం ఎదిరించాడు. అన్యాయం, అక్రమాలను ప్రశ్నించాడు. అవినీతి, అధర్మానికి ఎదురుదిరిగాడు. బహు దైవారాధన, విగ్రహారాధన మహా పాపమని చాటి చెప్పాడు. బడుగు బలహీన వర్గాలు, పీడిత తాడిత శ్రామిక వర్గాల గుండె గొంతుగా మారాడు. అసభ్యం, ఆశ్లీలత, మద్యపానం, భ్రూణహత్యలు, అంటరానితనం సామాజిక నేరాలని ఉపదేశించాడు. ఆయన తండ్రితోపాటు గ్రామస్తులంతా దీన్ని సహించలేకపోయారు. ఇబ్రహీంను దేశ బహిష్కరణ చేస్తారు.
ఒక సందర్భంలో ఇబ్రాహీంను అగ్నిగుండంలో వేసి తగులబెట్టారు. అగ్నిగుండాన్ని అల్లాహ్ తన ఇబ్రహీం కోసం గులాబీ వనం చేసి మంటల వేడికి బదులు చల్లటి ప్రశాంతతను కల్పించి కాపాడారు. ఇలాంటి పరీక్షల్లో మరొకటి ఇబ్రహీంకి తన ప్రభువైన అల్లాహ్ మరో పరీక్ష పెట్టాడు. తన భార్యతోపాటు తన ఏకైక సంతానాన్ని జన సంచారం లేని సుదూర ఎడారిలో వదిలేయాలని ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం మేరకు ఇబ్రాహీం తన భార్య, కుమారుడిని వదిలివేసి వెనక్కివచ్చాడు. కాగా ఎలాంటి జన సంచారం, ఆకలి దప్పులు తీర్చుకునేందుకు అవకాశంలేని ఆ ప్రాంతంలో అల్లాహ్ తన అద్భుత శక్తితో ఒక నీటి చెలిమను ప్రత్యక్ష పరిచాడు. నేడు యావత్ ముస్లింలు (హజ్ కు వెళ్లే వారు) ఈ నీటిని ‘జమ్ జమ్’ అని పవిత్ర జలంగా స్వీకరిస్తారు. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంల త్యాగానికి సంస్మరణే నేడు ముస్లింలు జరుపుకొంటున్న ఇదుల్ అజ్హా (బక్రీద్). ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం ‘జిల్‌హజ్’ మాసం 10న పండుగ జరుపుకొంటారు. ఇదేరోజు పవిత్ర మక్కా నగరంలో ‘హజ్’ జరుగుతుంది.
ఖుర్బానీ ప్రాముఖ్యత ఇదీ..
ఇబ్రహీం అలైహిస్సలాం త్యాగానికి ప్రతిఫలంగా ఈ పండుగ జరుపుకొంటారు. ప్రతి ముస్లిం భక్తిశ్రద్ధలతో ఈదుల్ అజ్హా ప్రత్యేక నమాజ్ చేస్తాడు. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు గొర్రె లేదా మేకపోతులను ఖుర్బానీ ఇస్తారు. మధ్యతరగతి వర్గాల వారు ఏడుగురు కలిసి ఒక జీవాన్ని ఖుర్బానీ చేస్తారు. మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒకటి పేదలకు, మరోవాటా బంధువులకు, చివరి వాటాను తమ ఇంటికి తీసుకెళ్తారు. మహా ప్రవక్త ఇబ్రహీం అలైహివస్సలాం సూచించిన విధానాలను అవలంబించడంలో భాగంగా ముస్లింలు ప్రత్యేక నమాజు చేసి తమ తప్పులను మన్నించమని వేడుకుంటారు. ఆరోగ్యంతో పరిపుష్టిగా వున్న వారు ఈ సందర్భంగా ఉపవాసాలను ఆచరిస్తారు.
ముస్తాబైన మసీదులు, ఈద్గాహ్లు..
ఈదుల్ అజ్హా ప్రార్థనకు జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాలోని మసీదులు, ఈద్గాహ్లు ముస్తాబయ్యాయి. ముస్లింలు పరిగడుపునే ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక ఈద్ నమాజ్ కోసం ఈద్గాహ్లు సిద్ధమయ్యాయి. వర్షం కారణంగా మసీదులు, ఈద్గాహ్ల్లో ఏర్పాట్లు మందకొడిగా సాగాయి.