మామిళ్లగూడెం, జూలై 9: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించినందున జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ప్రాణ నష్టం జరుగకుండా అన్ని ముందస్తు చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను అప్పటికే గుర్తించినందున ఆయా ప్రదేశాలను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రత్యేక అధికారిని నియమించి పరిస్థితులను ఎదురొనేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఏ పరిస్థితులనైనా ఎదురొనేలా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఏఈలకు వారి పరిధిలోని చెరువులు, కుంటలు, నీటి వనరులపై పూర్తి అవగాహన ఉండాలన్నారు.
వర్షాలు, గాలులకు చెట్లు పడిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే ఆసారం ఉన్నచోట విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. వాగులు పొంగి రాకపోకలు నిలిచిన గ్రామాల్లోని ప్రసవ సమయమున్న గర్భిణులను ముందే అనువైన ప్రదేశానికి తరలించాలని, ఉన్నచోట సరైనా వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, భవనాలను గుర్తించి అందులో నివాసం ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. లోతట్టు గ్రామాల వారిని తరలించేందుకు పునరావాస కేంద్రాలు గుర్తించాలని, ఆ కేంద్రాల్లో కనీస వసతులు, భోజన సౌకర్యాలు చేయాలని సూచించారు. వర్ష పరిస్థితిపై ప్రతి రెండు గంటలకూ ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదురైతే 24×7 పని చేసే కంట్రోల్ రూంలోని 1077, 9063211298 అనే టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి సహాయాన్ని పొందవచ్చన్నారు. మండలాల వారీగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రణాళిక రూపొందించాలని, మండలాల ప్రణాళికను క్రోడీకరించి జిల్లా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అధికారులు తమ ప్రధాన కార్యస్థానాల్లోనే ఉంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి: మంత్రి అజయ్
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని విభాగాల అధికారులూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల వల్ల రోడ్లపై ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో రోడ్ల మీద నుంచి కాల్వల్లోకి వరద వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, లోతట్టు ప్రాంతాలు కొంతమేరకు జలమయమయ్యాయని అన్నారు. రహదారులపై ప్రవాహం అధికంగా ఉంటే దాటకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వాగులు, నదులు ఉధృతంగా ప్రవహించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో చేపలవేటకు వెళ్లకుండా మత్య్సకారులను అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారుల సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కలెక్టర్
ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అనుదీప్ తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నందున వాటి మీదుగా జరిగే రాకపోకలను నిలిపివేయాలని, బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతున్నందున రామాలయానికి వచ్చే భక్తులు నదీ స్నానానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
సాగునీటి ప్రాజెక్టుల నుంచి వరద నీటిని వదులుతున్నందున ఆ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు తగు సమాచారం ఇవ్వాలని సూచించారు. నీటి ఉధృతి వల్ల చెరువుల కట్టలు బలహీనపడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి వాటిల్లో సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కంట్రీ బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర సేవల కోసం భద్రాచలం సబ్ కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు. సహాయం అవసరమైన ప్రజలు 08743 237444 అనే నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక్ చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, అధికారులు పాల్గొన్నారు.