తిరుమలాయపాలెం, జూలై 9 : ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం, రాయితీలు అమలు చేస్తుండడం, పండించిన పంటను సర్కారే కొనుగోలు చేయడం, మద్దతు ధర అందిస్తుండడం, నికర ఆదాయం వస్తుండడం వంటివి రైతాంగాన్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.. గతంలో కేవలం సత్తుపల్లి నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన సాగు ఇప్పుడు జిల్లా అంతటా విస్తరించింది.. ప్రసుతం జిల్లాలో 8 వేల ఎకరాల్లో పంట సాగవుతున్నది.. దీనిని 13,300 ఎకరాలకు విస్తరించేందుకు హర్టికల్చర్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను సిద్ధం చేస్తున్నారు..
ఆయిల్‌పామ్ సాగు పట్ల ఖమ్మం జిల్లా రైతుల్లో క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. సత్తుపల్లి డివిజన్‌కే పరిమితమైన ఈ పంట జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోంది. ఆయిల్‌పామ్ పంటకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండడం, ఆయిల్‌పాం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రోత్సాహకాలు ఇస్తుండడం, అన్ని పంటల కంటే అధిక ఆదాయం పొందే వీలుండడం వంటి కారణాల వల్ల రైతులు క్రమక్రమంగా ఆయిల్‌పామ్ సాగు వైపు మళ్లుతున్నారు. ఉద్యానవన శాఖ అధికారుల గణాంకాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 8,000 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగవుతోంది.
ఈ ఏడాది 13,300 ఎకరాల్లో ఈ పంటను చేయించేలా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు హర్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రస్తుతం 1,200 ఎకరాల్లో పామాయిల్ సాగవుతుండగా ఈ ఏడాది మరో 2,000 ఎకరాల్లో సాగును పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 50శాతం మేర సాగు చేసే రైతులను గుర్తించారు. ఆయిల్‌పాం సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాలు పొందే అవకాశాలు ఉండడంతో ఈ పంట సాగు పట్ల రైతులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. దీంతో ఆయిల్‌పామ్ సాగు వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు.
సబ్సిడీలు, ప్రోత్సాహకాలు..
ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు ఎకరానికి మొక్కలకు కోసం రూ.9,291ను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోంది. మొక్కల నాటేందుకు గుంతల తవ్వకానికి ఈజీఎస్‌ను అనుసంధానం చేసింది. ఎరువులు, ఇతర యాజమాన్య పద్ధతులకుగాను ఎకరానికి రూ.2,000 చొప్పున నాలుగేళ్లపాటు ప్రభుత్వం అందజేస్తోంది. ఎస్టీ, ఎస్సీ రైతులకు 100 శాతం, బీసీ, ఓసీలకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తోంది.
క్రమంగా తప్పకుండా నికర ఆదాయం..
ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతులు దీర్ఘకాలంపాటు ఆదాయం పొందే వీలుంది. మొక్కలు నాటిన నాలుగు నుంచి ఐదేళ్ల మధ్య కాలంలో ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ ఆదాయం వస్తుంది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతుంది. పామాయిల్ దిగుబడి ఎకరానికి 8- 10 టన్నులు వస్తుంది. ఈ పంటను గోద్రేజ్, టీఎస్ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తారు. ప్రస్తుత ధరల ప్రకారం టన్ను పామాయిల్ గెలలకు రూ.23,000 చెల్లిస్తారు. ఎకరానికి సుమారు 10 టన్నుల దిగుబడి వచ్చినా దాదాపు రూ.2.30 లక్షల ఆదాయం వచ్చినట్లవుతుంది. ఇక అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందొచ్చు. మొదట్లో ఎకరానికి రూ.30,000 వరకూ పెట్టుబడి ఉంటుంది. ఆ తర్వాత పెట్టుబడి తగ్గుతుంది. ఈ పంటకు చీడపీడలు, కోతల బెడద, దొంగల భయం వంటివి ఉండవు. మొక్కలు నాటిన తర్వాత 30 ఏళ్ల వరకూ ఈ పంట ద్వారా క్రమంగా నికర ఆదాయం పొందొచ్చు.
మంచి ధర లభిస్తోంది..
ఆయిల్‌పామ్ సాగు ద్వారా మంచి ఆదాయం పొందొచ్చు. నేను ఎనిమిదేళ్ల క్రితం 40 ఎకరాల్లో సాగు చేశాను. మొదటి నాలుగైదేళ్లలో తక్కువ ఆదాయం వచ్చింది. ఆరో ఏట నుంచి ఎకరానికి రూ.90,000 నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తోంది. నెలకు రెండుసార్లు పంట కటింగ్ చేసి ఫ్యాక్టరీకి తరలించాల్సి ఉంటుంది. పంట కొనుగోలు, పేమెంట్ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులూ లేవు. మంచి ధర లభిస్తోంది.
– దొండేటి శ్రీనివాసరావు, రైతు, పిండిప్రోలు
డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేసుకోవాలి
మార్కెట్లో మంచి డిమాండ్, అధిక ధర ఉన్న పంటలనే రైతులు సాగు చేయాలి. పామాయిల్ నూనె వాడకం ఎక్కువ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ పంటకు డిమాండ్ బాగా ఉంది. అందుకే ఈ పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపట్టి మంచి లాభాలు పొందొచ్చు.
– నగేశ్, హర్టికల్చర్ అధికారి, కూసుమంచి