మణుగూరు టౌన్, జూలై 9: మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రి రూపురేఖలు మారుస్తానని, వంద బెడ్ల ఆసుపత్రిని నిరంతరం వైద్యం అందించే కేంద్రంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు ప్రాంత ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతానని మాట ఇచ్చారు. మణుగూరులో రూ.కోటితో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్, రూ.43 లక్షలతో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, రూ.5 లక్షలతో నిర్మించిన ఆసుపత్రి వంటశాలను కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడాలేని విధంగా రూ.కోటితో ఆక్సిజన్ ప్లాంట్‌ని మణుగూరు 100 బెడ్ల ఆసుపత్రి ఆవరణలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
రానున్న రోజుల్లో మౌలిక వసతులు కల్పించి ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా నిలుపుతానన్నారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి ఆసుపత్రిలో పర్యటించి రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు నాగరాజు, కే.మాధవి, గిరిప్రసాద్, రాజగోపాల్, పోశం నర్సింహారావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, బచ్చల భారతి, తాళ్లపల్లి యాదగిరి ఆవుల నర్సింహారావు, గుడిపూడి కోటేశ్వరరావు, బాబూరావు, కారం ముత్తయ్య, ఏనిక ప్రసాద్, బొగ్గం రజిత తదితరులు పాల్గొన్నారు.
వ్యాపార రంగంలో ఎదగాలి
దళితులు ఉపాధి, వ్యాపార రంగాల్లో ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మండలలోని పగిడేరుకు చెందిన బేతమళ్ల సుందర్, ఎల్చిరెడ్డిపల్లికి చెందిన కొప్పుల శ్రీరామ్‌లకు దళితబంధు కింద మంజూరైన వాహనాలను మణుగూరులోని క్యాంపు కార్యాలయం వద్ద వారికి అందజేశారు.