చుంచుపల్లి, జూలై 9: హిందూ సంప్రదాయంలో భక్తులు ఏ మంచి పని ప్రారంభించాలన్నా దశమి, ఏకాదశుల కోసం ఎదరుచూడడం అలవాటు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిగానే తొలి ఏకాదశిగా జరుపుకొంటాం. దీనినే శయన ఏకాదశి లేదా ప్రథమ ఏకాదశి హరివాసనం అని కొలుస్తారు. ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కథనం.
పండుగ ప్రాశస్త్యం ఇదీ..
పండుగ ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా వెళ్తున్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. దీనినే దక్షిణాయణం అంటాం. ఈరోజు నుంచే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. ఇదే రోజు భక్తులు గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిన ఒంటి పూట భోజనం చేసి శేషశాయి లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. సాక్షాత్తూ విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు.
స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు. సతీ సక్కుబాయి శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి రోజు ఉపవాసం ఉంటూ రాత్రి జాగారం చేస్తే ఎంతో పుణ్యం. మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణ గాథ. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు.
పూజా విధానం.. నియమాలు..
వ్రతాన్ని ఆచరించదలచినారు సూర్యోదయానికి ముందుగా నిద్రలేవాలి. శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ఠగా పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించాలి. చక్కెర పొంగళిని నైవేద్యంగా పెట్టాలి. కర్పూర హారతి ఇవ్వాలి. భక్తులు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. దుష్ట పనులు, ఆలోచనలు చేయకూడదు. రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు శ్రీహరిని పూజించి భోజనం చేయాలి. అనంతరం అన్నదానం చేస్తే శుభప్రదం.