భద్రాచలం/ పర్ణశాల, జూలై 9: భద్రాచలం వద్ద గోదావరి నిలకడగానే ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల శుక్రవారం వరద కాస్త ఎక్కువగా ప్రవహించింది. దీనికితోడు డ్యామ్ల నుంచి కూడా వరద నీరు విడుదలవుతుండడంతో ప్రవాహం కాస్త పెరిగింది. శనివారం ఉదయం 7 గంటలకు 20.02 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రం 6 గంటలకు కొద్దికొద్దిగా పెరుగుతూ 20.06 అడుగులకు చేరుకుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు 22 అడుగులకు చేరవచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. కాగా, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నందున ప్రజలు స్నానాలకు గానీ, చేపల వేటకు గానీ గోదావరిలోకి దిగవద్దని సూచించారు. కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఏక్షణంలోనైనా గోదావరి వరద పెరగవచ్చన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పర్ణశాల వద్ద గోదావరి పెరుగుదల
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మండలంలోని పర్ణశాల వద్ద గోదావరి స్వల్పంగా పెరిగింది. చుట్టుపక్కల గ్రామాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షానికి నారచీరెల ప్రాంతం వద్ద శుక్ర, శనివారాల్లో సీతవాగు పెరిగి సీతమ్మ విగ్రహం పాక్షికంగా మునిగింది. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు పర్ణశాల రామయ్యను దర్శించుకున్న అనంతరం నారచీరల ప్రాంతాన్ని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. గౌరారం వద్ద చిన్నగుబ్బలమంగి వాగు నిండుగా ప్రవహిస్తోంది.