భద్రాచలం, జూలై 8: గిరిజనుల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. గిరిజనులకు విద్య, వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వాలు జిల్లాలో 9 గురుకులాలను ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు సీఎం కేసీఆర్ మరో 20 గురుకులాలను ఏర్పాటు చేశారని అన్నారు. ఫలితంగా ఏజెన్సీలోని గిరిజనుల పిల్లలందరికీ విద్య అందుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టంతో పోడు భూముల సమస్య ఏర్పడిందని అన్నారు. అయినప్పటికీ ఈ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. అనంతరం స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన విద్యా వ్యవస్థ పటిష్టం చేసేందకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు.
ఏజెన్సీలో పోడు భూముల సమస్య ఉందని, ఆదివాసీలు సాగుచేసుకుంటున్న పోడు భూముల జోలికి వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అటవీ అధికారులు అత్సుత్సాహం చూపిస్తున్నారని అన్నారు. ఆర్వోఎఫ్ఆర్ ద్వారా అటవీ అధికారుల సమస్య లేకుండా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి నాలుగు జిల్లాల్లోని గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లోని టెన్త్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకు సాధించి గిరిజన విద్యా విభాగానికి మంచిపేరు తీసుకొచ్చారని అన్నారు. అనంతరం భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో రూ.1.10 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన భవన్‌ను మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాద్రి, మహబూబాబాద్ జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, అంగోత్ బిందు, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
గిరిజనుల సమస్యల పరిష్కార వేదిక : తాతా మధు, ఎమ్మెల్సీ, ఖమ్మం
గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ పాలక మండలి సమావేశం చక్కటి వేదిక. ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. గిరి వికాసం పథకం ద్వారా బోర్లు, మోటార్లు, త్రీఫేజ్ కరెంట్ వంటివి అందిస్తున్నారు. గిరిజన యువత ఆర్థికాభివృద్ధి కోసం ట్రైకార్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేస్తున్నారు. కరోనా కారణంగా 34 నెలలుగా ఐటీడీఏ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయలేదు. ఈ సమావేశం ద్వారా తెలిసిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
పోడు సమస్యలకు త్వరలోనే పరిష్కారం.. : పాయం రమణ, జడ్పీటీసీ, వెంకటాపురం
ఐటీడీఏ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. గిరిజనుల సమస్యలను అధికారులు, మంత్రులకు విన్నవించాం. ఈ సమావేశాన్ని ప్రతి మూడు నెలలకు కాకపోయినా ఆరు నెలలకు ఒకసారైనా ఏర్పాటు చేస్తే గిరిజనుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలోనే ఆ సమస్య పరిష్కారమవుతుంది.