ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం/ రఘునాథపాలెం, జూలై 8: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం విస్తారంగా వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 19.08 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. చింతకాని నాగులవంచ గ్రామంలో 14.70 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
19.18 సెం.మీ. వర్షపాతం
గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా సరాసరి 19.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూసుమంచి మండలంలో రికార్డు స్థాయిలో 14.08 సెటీమీటర్ల వర్షపాతం కురిసింది. నేలకొండపల్లిలో 13.04, బోనకల్లులో 12.56, వైరాలో 10.94, మధిరలో 10.10, ఖమ్మం అర్బన్‌లో 11.14, చింతకానిలో 11.12, ముదిగొండలో 10.18, రఘునాథపాలెంలో 10.28, తల్లాడలో 9.8, కల్లూరులో 9.22, ఖమ్మం రూరల్‌లో 8.62, సింగరేణి, కామేపల్లి, తిరుమలయపాలెం, కొణిజర్ల, ఏన్కూరు, పెనుబల్లి, ఎర్రుపాలెం మండలాల్లో 6 – 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌లో జిల్లా సాధారణ వర్షపాతం 105.2 మి. మీ. కాగా, 121.4 మి. మీ. నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 272 మి. మీ. కాగా ఇప్పటి వరకు 281.7 మి. మీ. నమోదు కావడం విశేషం.
పొంగి పొర్లిన వాగులు..
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం మున్నేరు వాగుకు వరద నీరు పోటెత్తడంతో ఒక్కసారిగా అది పరవళ్లు తొక్కింది. ఎలాంటి ప్రమాదమూ చోటుచేసుకోకుండా ఏసీపీ రామోజీ రమేశ్, సీఐలు అశోక్, అంజలిలు వరద ఉధృతిని పరిశీలించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని డీఈవో విజయనిర్మల సూచించారు.
రఘునాథపాలెంలో..
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో రఘునాథపాలెం మండలంలోని వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. పాపటపల్లి – వీఆర్ బంజర ప్రధాన రహదారి మీదుగా బుగ్గవాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఈ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఖమ్మం రూరల్ సీఐ శ్రీనివాసరావు, రఘునాథపాలెం ఎస్సై మాచినేని రవిలు ఈ బుగ్గవాగును పరిశీలించి బారీకేడ్లు ఏర్పాటు చేయించారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ కూడా ఈ ప్రవాహాన్ని పరిశీలించారు. కేవీ బంజర వద్ద నిమ్మవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం పరవళ్లు తొక్కుతోంది. మల్లేపల్లి చెరువు, వేపకుంట్ల, రఘునాథపాలెం చెరువులు అలుగులు పోస్తున్నాయి. వేపకుంట్ల చెరువు అలుగుల వద్ద గ్రామస్తులు చేపలు పట్టారు. వేపకుంట్లలో ఇంటి పరిసరాల్లో నిలిచిన నీటిని సర్పంచ్ దారా శ్యాం జేసీబీ సహాయంతో చెరువులోకు మళ్లించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం నగరంలోని వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేఎంసీ మేయర్ నీరజ ఆదేశించారు. విరామం లేకుండా వర్షం కురుస్తున్నందున కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి నగరంలోని 37వ డివిజన్లో శుక్రవారం ఆమె పర్యటించారు. డిప్యూటీ మేయర్ ఫాతిమా, డీఈ స్వరూపరాణి, ఏఈలు నవ్యజ్యోతి, శోభన్‌బాబు పాల్గొన్నారు.