ఖమ్మం వ్యవసాయం, జూలై 8: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మరోసారి అరుదైన రికార్డు నెలకొన్నది. తేజా రకం ఏసీ మిర్చి పంటకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. శుక్రవారం ఉదయం మిర్చియార్డుకు ఆయా జిల్లాల రైతులు 1,500 బస్తాలను తీసుకొచ్చారు. అనంతరం జెండాపాటలో ఖరీదుదారులు పోటీపడడంతో గరిష్ఠ ధర క్వింటాకు రూ.22,300 పలికింది. సాధారణ రకం పంటకు గరిష్ఠ ధర క్వింటాకు రూ.17,500 పలికింది. దేశ వ్యాప్తంగా ఏసీ రకం తేజా మిర్చి పంటకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు. నాణ్యమైన పంటను యార్డుకు తీసుకొచ్చి చరిత్ర సృష్టించిన ఆ రైతును ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, గ్రేడ్-టూ అధికారి బజార్ తదితరులు సత్కరించారు. మిర్చిశాఖ అధ్యక్షుడు మాటేటి నాగేశ్వరరావు, ఇతర మార్కెట్ సిబ్బంది, వ్యాపారులు పాల్గొన్నారు.