
ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలపై కేంద్రంలోని మోదీ సర్కారు మరో భారం మోపింది. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 50 మేర పెంచింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జనాగ్రహం పెల్లుబికింది. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు గురువారం పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. ఆయా ప్రాంతాల్లో ఖాళీ సిలిండర్లతో ప్రదర్శనలు నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. బైబై మోదీ అంటూ నినాదాలు చేశారు. ఆయా చోట్ల జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు రాములు నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం, జూలై7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరపై ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా జనాగ్రహం పెల్లుబికింది. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శ్రేణులు గురువారం పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహంచారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీ సిలిండర్లతో ప్రదర్శనలు నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. సామాన్యులపై భారం వేయడం సరికాదని నేతలు ధ్వజమెత్తారు. ఏడాదిలో రూ.250 పైగా గ్యాస్ ధరను పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చండ్రుగొండ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు అన్ని మండల కేంద్రాల్లో పెద్దఎత్తున నిరసన తెలిపారు. సత్తుపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే వెంకటవీరయ్య మహిళలతో కలిసి కట్టెలపొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఇల్లెందుక్రాస్ రోడ్డు వరకు ఖాళీ సిలిండర్లతో ప్రదర్శన నిర్వహించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. పెంచిన ధరలను తగ్గిం చకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్ల్లు నీరజ, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాములునాయక్ ఆధ్వర్యంలో వైరా పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. మధిరలో జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. మణుగూరులో టీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.