ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూన్ 28:ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్స రాల్లో ఖమ్మం జిల్లాను ఐదో స్థానం, భద్రాద్రి జిల్లాను తొమ్మిదో స్థానంలో నిలిపారు. ఈ సారి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఖమ్మం జిల్లా ఫస్టియర్‌లో 69 శాతం, సెకండియర్‌లో 71 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఓవరాల్‌గా భద్రాద్రి జిల్లా 68 శాతం ఉత్తీర్ణత నమోదు చేసింది. ఖమ్మం జిల్లా ఫస్టియర్‌లో బాలికలు 76 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 61 శాతంతో సరిపెట్టుకున్నారు. సెకండియర్‌లో బాలికలు 78 శాతంతో రాణించగా.. బాలురు 64 శాతంతో ఆగిపోయారు. భద్రాద్రి జిల్లా ఫస్టియర్‌లో బాలురు 53 శాతం, బాలికలు 72 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో బాలురు 59 శాతం, బాలికలు 76 శాతం పాసయ్యారు.
ఇంటర్ ఫలితాల్లో పైచేయి సాధిస్తూ సరస్వతీ పుత్రికలుగా రాణిస్తున్నారు ఉమ్మడి జిల్లా విద్యార్థినులు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. ఇప్పటికే అద్భుత ఫలితాలు సాధిస్తూ, జిల్లాల విభజన అనంతరమూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు ఉమ్మడి జిల్లా విద్యార్థులు. తాజా ఇంటర్ ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఖమ్మం జిలాను ఐదో స్థానం, భద్రాద్రి జిల్లాను తొమ్మిదో స్థానంలో నిలిపారు. ఫస్టియర్‌లో 69 శాతం, సెకండియర్‌లో 71 శాతం ఉత్తీర్ణత సాధించింది ఖమ్మం జిల్లా. ఓవరాల్‌గా భద్రాద్రి జిల్లా 68 శాతం ఉత్తీర్ణత నమోదు చేసింది. ఖమ్మం విద్యార్థుల్లో ఫస్టియర్‌లో బాలికలు 76 శాతం ఉత్తీర్ణత శాతం సాధించగా.. బాలురు 61 శాతంతో సరిపెట్టుకున్నారు. సెకండియర్‌లో బాలికలు 78 శాతంతో రాణించగా.. బాలురు 64 శాతంతో ఆగిపోయారు.
ప్రథమంలో..
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ,ప్రైవేట్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ కళాశాలల నుంచి 14,274 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 9,869 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 6,939 మందికిగాను 4,272 మంది, బాలికలు 7,335 మందికి గాను 5,597 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సులో 2,424 మందికిగాను 1,278 మంది ఉత్తీర్ణులై 52 శాతం ఫలితాలు సాధించారు.
ద్వితీయంలో..
ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జనరల్ విభాగంలో 14,366 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 10,297 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 7,188 మందికిగాను 4,661 మంది, బాలికలు 7,178 మందికిగాను 5,636 మంది పాసయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,261 మంది బాలురకు గాను 470 మంది, 1,163 మంది బాలికలనుగాను 808 మంది ఉత్తీర్ణులయ్యారు.
టాప్ మార్కులు వీరివే..
ఖమ్మం శ్రీచైతన్య కళాశాలకు చెందిన డీ.శ్రీహరిణి ఫస్టియర్ బైపీసీలో 438 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించినట్లు కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. కృష్ణవేణి కళాశాలలో జూనియర్ ఎంపీసీలో పీ.రాజేశ్ 468 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించినట్లు అధిపతి యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. న్యూవిజన్లో పీ.కావ్య, ప్రణతి, లక్ష్మీవినీత, నవభావన, లలిత భవానీలు 467 మార్కులు సాధించినట్లు చైర్మన్ సీహెచ్‌జీకే ప్రసాద్ తెలిపారు. రెజోనెన్స్ నుంచి సీనియర్ ఎంపీసీలో వినయ్ 987 మార్కులు, జూనియర్ ఎంపీసీలో లక్ష్మీసాయి 467 మార్కులు సాధించినట్లు కళాశాలల డైరెక్టర్స్ రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్‌రావు తెలిపారు.
మెరిసిన సర్కారు ఆణిముత్యాలు..
ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి శ్యామసుందరాచారి సీనియర్ ఎంపీసీలో 985 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. రంజిత్‌కుమార్ 975 మార్కులతో సత్తా చాటాడు. బోనకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని జీ.నీలిమ జూనియర్ ఎంపీసీలో 465 మార్కులతో ప్రతిభ చాటింది. 14 కేజీబీవీల్లో 508 మంది విద్యార్థినులకు గాను 404 మంది పాసై 79 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. సీనియర్ ఎంపీసీలో కేజీబీవీ ఖమ్మం రూరల్‌కు చెందిన లావణ్య 932 మార్కులు, జూనియర్ ఎంపీసీలో ధరణి, ప్రస్తుతి 464 మార్కులు సాధించారు. కేజీబీవీ చింతకానికి చెందిన గౌతమి బైపీసీలో 962 మార్కులు, కేజీబీవీ ఏన్కూరుకు చెందిన స్వాతి సీఈసీలో 875 మార్కులు సాధించారు. సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 816 మంది విద్యార్థులకుగాను 690 మంది విద్యార్థులు పాసై 84.55 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ద్వితీయ సంవత్సరంలో 95.96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో కే.రవళి 466 మార్కులు, కే.శ్రీలేఖ ఎంపీసీలో 985 మార్కులు, కే.సింధు ఎంఈసీలో 964 మార్కులతో రాణించారు.
భద్రాద్రి జిల్లాకు 9వ స్థానం
ఇంటర్మీడియట్ ఫలితాల్లో భద్రాద్రి జిల్లా రాష్ట్ర స్థాయిలో 9వ స్థానం సాధించింది. ఫస్టియర్‌లో బాలురు 53 శాతం, బాలికలు 72 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో బాలురు 59 శాతం, బాలికలు 76 శాతం పాసయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో బాలురు 4,395 మందికి గాను 2,325 మంది, బాలికలు 5,719 మందికి గాను 4,100 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 10,114 మందికి గాను 6,425 మంది పాసయ్యారు. 65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో బాలురు 4,423 మందికి గాను 2,622 మంది, బాలికలు 5,658 మందికి గాను 4,281 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 10,081 మంది పరీక్షలు రాయగా 6,903 మంది పాసయ్యారు. 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎంపీసీ విద్యార్థి సాయి ఈక్షిత్ 985 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచాడు. జూనియర్ ఎంపీసీలో 33 మందికి 460కి పైగా మార్కులు, బైపీసీలో 13 మందికి 430పైగా మార్కులు సాధించారు.
కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ..
ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థులూ సత్తా చాటారు. భద్రాచలంలో చదువుతున్న ఎంపీసీ ప్రథమ సంవత్సర విద్యార్థిని నవ్య 461 మార్కులు సాధించింది. ఫస్టియర్ బైపీసీలో ఈ.సమత (పినపాక) 430 మార్కులు, చండ్రుగొండ నుంచి సీఈసీలో సీహెచ్ శైలజ 483 మార్కులు, బూర్గంపహాడ్ నుంచి ఎంపీహెచ్‌డబ్ల్యూలో పూజశ్రీ శర్మాజీ 479 మార్కులు, ములకలపల్లి నుంచి ఎంపీహెచ్‌డబ్ల్యూలో సౌమ్య 479 మార్కులు, దుమ్ముగూడెం నుంచి ద్వితీయ ఎంపీసీలో ఎస్.అపూర్వ 921 మార్కులు, బైపీసీలో కే.సుప్రియ 934 మార్కులు, చండ్రుగొండ నుంచి ఎంపీహెచ్‌డబ్ల్యూలో టీ.నవ్య 941 మార్కులు, సీఈసీలో బీ.కృపారాణి 814 మార్కులు సాధించారు. కేజీబీవీల్లో మొదటి సంవత్సరంలో 68 శాతం, ద్వితీయ సంవత్సరంలో 90.4 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దుమ్ముగూడెంలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 97.95 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 97.7 శాతం ఉత్తీర్ణులై రికార్డు నెలకొల్పారు. ములకలపల్లిలో మొదటి సంవత్సరంలో 97.8, ద్వితీయ సంవత్సరంలో 97.6 శాతం ఉత్తీర్ణత సాధించారు.
సత్తుపల్లి రూరల్, జూన్ 28 : ఇంటర్ ఫలితాల్లో పట్టణంలోని గాయత్రీ జూనియర్ కళాశాలలో సీఈసీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కె.శ్రీనిజ 500 మార్కులకు 492 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచినట్లు కళాశాల కరస్పాండెంట్ కూసంపూడి మధుసూదన్‌రావు తెలిపారు. కళాశాల డైరెక్టర్లు శ్రీనివాసరావు, శ్రీధర్, ప్రిన్సిపాల్ సుబ్బారావు, అధ్యాపకులు ఆమెను అభినందించారు. విద్యాభారతి, శ్రీవాణి కళాశాలల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్స్ లింగారెడ్డి, పాల ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.
బుగ్గపాడు విద్యార్థినికి స్టేట్ సెకండ్ ర్యాంక్
సత్తుపల్లి టౌన్, జూన్ 28 : ఇంటర్ ఫలితాల్లో బుగ్గపాడు గ్రామానికి చెందిన జి.కుసుమ శ్రీ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకును సాధించినట్లు శ్రీవాణి కళాశాల ప్రిన్సిపాల్ పాల ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కర్లపూడి ప్రజ్ఞ 470 మార్కులకు 465 మార్కులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విద్యార్థినిని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అభినందించారు.