శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి
భద్రాచలం పర్యటనలో ఎంపీ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాచలం, జూన్ 27: విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు. విద్య, వైద్యంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం భద్రాచలం వచ్చిన వారు.. తొలుత టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు గృహంలో అల్పాహారం స్వీకరించారు. తరువాత గిరిజన బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగుల కోసం కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందుల్లో ప్రత్యేక గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.
శిక్షణతో ఉద్యోగం సాధించాలి
ప్రభుత్వం ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని గిరిజన అభ్యర్థులు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సూచించారు. ఎస్సై, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఐటీడీఏ సమావేశ మందిరంలో శిక్షణ తీసుకుంటున్న యువతీ యువకులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఐటీడీఏ ఆధ్వర్యంలో 127 ఎస్సై, 420 కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు శిక్షణను ప్రారంభించినట్లు చెప్పారు.
ప్రజల కోసమే సంక్షేమ పథకాలు..
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. భద్రాచలంలో సోమవారం వారు పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.