మామిళ్లగూడెం, జూన్ 24: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 77 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని, ఆ స్పాట్లలో అన్ని భద్రతా చర్యలను చేపట్టాలని అన్నారు. రోడ్డు మలుపులు, జంక్షన్ల ప్రాంతాల్లో, ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. హైవేలపై ఉన్న గ్రామాల ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా రోడ్డు భద్రతా మ్యాప్‌ను అభివృద్ధి పర్చాలన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే త్వరితగతిన చేరుకునేలా అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తరలించడం, ప్రాణాలు కాపాడడం వంటివి చేసిన వారిని ప్రోత్సహించేలా సన్మాన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
నివారణ చర్యలు చేపట్టాలి..
సీపీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇప్పటి వరకు 295 ప్రమాదాలు జరిగాయని, వాటిలో 101 మంది మరణించగా మరో 284 మంది గాయపడ్డారని వివరించారు. పోలీస్ స్టేషన్ల వారీగా తమ తమ పరిధిలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ప్రమాదాల నివారణకు అన్ని చర్యలూ చేపట్టాలని ఆదేశించారు. ఖమ్మంలో పోలీసు అధికారులు, కేఎంసీ కమిషనర్ సమావేశమై ఏయే ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఏడీసీపీలు శబరీష్, సుభాశ్ చంద్రబోస్, ఆర్అండ్బీ ఈఈ శ్యామ్‌ప్రసాద్, డీటీవో కిషన్‌రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి, ఏసీపీలు, సీఐలు, అధికారులు పాల్గొన్నారు.