పాల్వంచ రూరల్, జూన్ 24: ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు పాల్వంచ ప్రభ్వు డిగ్రీ కళాశాలలో అద్భుతమైన వనరులు అందుతున్నాయని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) బృంద ప్రతినిధులు పేర్కొన్నారు. గురు, శుక్రవారాల్లో రెండు రోజులపాటు పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యటించారు. విద్యార్థులకు కరిక్యులం, సహపాఠ్య కార్యక్రమాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కళాశాల ద్వారా ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు ఎంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా చైర్పర్సన్ ప్రొఫెసర్ దివాకర్ చంద్రదేక, మెంబర్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ శివరాంప్రసాద్ రామినేని, మెంబర్ డాక్టర్ జేవీఆర్ వేదం ఎస్జే ఉన్నారు. అనంతరం కళాశాలలోని డిపార్ట్మెంట్లు, కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీ, జిమ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎగ్జామినేషన్ బ్రాంచ్, ఎన్ఎస్ఎస్ ఆక్టివిటీస్, సైన్స్ ల్యాబ్, కళాశాలలోని నర్సరీ, బొటానికల్ గార్డెన్, ఆర్వో ప్లాంట్, ఉమెన్స్ వెయిటింగ్ రూమ్, బాయ్స్ అండ్ గర్ల్స్ టాయిలెట్స్, కళాశాల ప్లే గ్రౌండ్, వెహికిల్ పార్కింగ్ స్టాండ్ సహా కళాశాలలోని అన్ని అంశాలనూ పరిశీలించారు. ప్రిన్సిపాల్ చిన్నప్పయ్య, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.