ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 24: జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ (జేఈఈ) మెయిన్స్ పరీక్ష శుక్రవారం ఖమ్మంలోని రెండు కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం పేపర్ -1కు 384 మంది విద్యార్థులకు గాను 22 మంది గైర్హాజరై 362 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పేపర్-2కు 380 మందికిగాను 357 మంది హాజరై 23 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 45 మంది గైర్హాజరై 719 మంది హాజరైనట్లు జేఈఈ పరీక్షల కో ఆర్డినేటర్ ఆర్.పార్వతిరెడ్డి తెలిపారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన జేఈఈ పరీక్ష కేంద్రాలను సీబీఎస్ఈ అధికారులు ఆన్లైన్లో పర్యవేక్షణ చేశారు. అధికారులు గంట ముందుగానే కేంద్రంలోకి అనుమతిస్తామని ప్రకటించడంతో విద్యార్థులు ముందస్తుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలను ఏఐసీటీఈ పరీక్షల అబ్జర్వర్లు పరీక్షలను పర్యవేక్షించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెషన్-2 నిర్వహించారు.
సెంటర్ల వారీగా..
సెషన్-1లో కిట్స్‌లో 184 మందికిగాను 8 మంది గైర్హాజరై 176 మంది హాజరయ్యారు. మదర్‌థెరిస్సా కేంద్రంలో 200 మందికి గాను 14 మంది గైర్హాజరై 186 మంది హాజరయ్యారు. మొత్తంగా సెషన్-1లో 384 మందికి 22 మంది గైర్హాజరై 362 మంది హాజరయ్యారు. సెషన్-2లో కిట్స్‌లో 180 మందికి 9 మంది గైర్హాజరై 171 మంది హాజరయ్యారు. మదర్థెరిస్సాలో 200 మందికి 14 మంది గైర్హాజరై 186 మంది హాజరయ్యారు. మొత్తం 380 మందికి గాను 357 మంది హాజరయ్యారు.
కేంద్రాల్లో జామర్లు..
పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతున్న జేఈఈ పరీక్షల్లో భాగంగా కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో జామర్లు ఉండడంతో ఫోన్ సిగ్నల్స్ సైతం ఉండవు. ఎలాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు పనిచేయకుండా ఉండేందుకు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఈనెల 29 వరకు ఆన్లైన్ పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతి కళాశాలలో పూర్తిగా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు.
విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే సమయంలో వారి వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరమే కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. కేవలం హాల్‌టికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. విద్యార్థుల హాల్‌టికెట్‌పై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేయగానే విద్యార్థుల వివరాలు కంప్యూటర్‌పై డిస్ప్లే అయిన తర్వాతే కేంద్రాల్లోకి సిస్టంను కేటాయిస్తున్నారు. పరీక్షలను ఏఐసీటీఈ ఏడిక్విట్ సంస్థ నిర్వహిస్తోంది. ఎన్టీఏ సంస్థ ఎన్95 మాస్కులను అందిస్తోంది. జేఈఈ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించారు.