ఖమ్మం, జూన్ 24 : ఖాళీ స్థలాల్లో ముళ్లపొదలు, పిచ్చి మొక్కల తొలగింపు.. నేలవాలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత స్తంభాలు, మొక్కలకు ట్రీగార్డులు, మురుగు కాలువల్లో పూడికతీత,పైప్లైన్ల లీకేజీలకు మరమ్మతులు, పార్కుల్లో మొక్కలు నాటడం, వేలాడుతున్న విద్యుత్ లైన్ల సవరింపుతో ‘పట్టణ ప్రగతి’ నగరానికి నూతన శోభను తీసుకొచ్చింది.. ఖాళీ స్థలాల్లో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపింది.. మంత్రి అజయ్‌కుమార్, నగర మేయర్ నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించి నగరాన్ని ‘స్వచ్ఛ ఖమ్మం’గా మార్చారు..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాలు, నగరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఖమ్మం జిల్లాలోని 584 గ్రామ పంచాయతీలతోపాటు మూడు మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థలో ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన 5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు వారి నియోజకవర్గాల్లో పాల్గొనగా కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో పర్యటించారు. ఖమ్మం నగరంలో జరిగిన పట్టణ ప్రగతిలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి విస్తృతంగా పాల్గొన్నారు.
నగరంలోని 60 డివిజన్లలో ఈ కార్యక్రమం 15 రోజుల పాటు విజయవంతంగా జరిగింది. పారిశుధ్యం, రోడ్లు, మురుగు కాలువలను శుభ్రం చేయడం, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలను తొలగించడం, డ్రెయిన్లలో పూడిక తీయడం, కొత్త డ్రెయిన్లు నిర్మించడం వంటి పనులు చేపట్టారు. పరిశుభ్రత, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు తరలించారు. నగరంలో ప్రత్యేకంగా జేసీబీలతో ఖాళీ స్థలాలను శుభ్రం చేయించారు. నర్సరీలు, పట్టణ ప్రకృతి వనాలను పరిశీలించారు.
2,758 టన్నుల చెత్త తొలగింపు..
ఖమ్మం నగరంలోని 60 డివిజన్లలో ఖాళీ స్థలాలను శుభ్రం చేశారు. స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వగా కొంతమంది యజమానులు స్పందించి వెంటనే శుభ్రం చేయించారు. మిగిలిన వారు స్పందించలేదు. దీంతో కేఎంసీ అధికారులు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నగరంలోని 613 ప్లాట్లను శుభ్రం చేశారు. పట్టణ ప్రగతిలో 15 రోజులపాటు చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా నగరంలో 2,758 టన్నుల చెత్తను తొలగించి డంపింగ్ యార్డుకు తరలించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో 164 కిలోమీటర్ల పొడవున ఉన్న పొదలను జేసీబీలతో తొలగించారు. 257 కిలోమీటర్లు పొడవున వివిధ డ్రైనేజీల్లో ఉన్న పూడికను జేసీబీలతో తొలగించారు. మురుగు కాలువల్లో చెత్త వేయకుండా 140 చోట్ల జాలీలను ఏర్పాటు చేశారు. నగరంలో వినియోగిస్తున్న 48 మరుగుదొడ్లను శుభ్రం చేశారు. 174 ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రం చేశారు.
వివిధ మతాలకు చెందిన 75 స్థలాలు, పార్కులను శుభ్రం చేశారు. 35 లోతట్టు ప్రాంతాలను పూడ్చివేశారు. 602 చోట్ల దోమల మందు స్ప్రే, ఫాగింగ్ చేశారు. 32 కేజీల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సీజ్ చేశారు. రూ.42,300 జరిమానా విధించారు. 19 చోట్ల పనిచేయని, ఎండిపోయిన బోర్లను మూసివేశారు. 6 ఇంకుడు గుంతలను పునరుద్ధరించారు. కొత్తగా ఒక్క చోట ఇంకుడు గుంతను నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న 26 ఇళ్లను కూల్చివేశారు. 111 స్థలాల్లో కలుపు తీశారు. చెట్ల గార్డులు సరిచేశారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ప్రదేశాల్లో 572 మొక్కలను నాటారు. రోడ్ల మధ్యలో 1,590 మొక్కలను నాటారు. కొత్త ట్రీ పార్కుల కోసం మూడు స్థలాలను గుర్తించగా, వాటిలో 198 గుంతలను తవ్వారు. వీటితోపాటు ఇండ్లకు 1,08,500 మొక్కలను పంపిణీ చేశారు. 18 చోట్ల నీటి సరఫరాలో పైపులైన్ల లీకేజీలను గుర్తించి, తాగునీరు వృథా కాకుండా, కలుషితం కాకుండా చర్యలు చేపట్టారు. రెండు చోట్ల వంగిన విద్యుత్ స్తంభాలను సరి చేశారు. ఒక్కచోట తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాన్ని మార్చారు. 200 మీటర్ల పొడవునా వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేశారు. 10 శ్మశానవాటికలను శుభ్రం చేశారు. నూతనంగా ఒక చోట వైకుంఠధామం పనులు ప్రారంభమయ్యాయి. 44 చోట్ల తెలంగాణ క్రీడా ప్రాంగణాలను గుర్తించగా 5 చోట్ల వాటిని ఏర్పాటు చేశారు.
44 చోట్ల క్రీడా ప్రాంగణాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు నిధులను కేటాయించింది. రూ 5 లక్షల వరకు ఖర్చు చేసుకునేలా గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు అనుమతి ఇచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కూడా 44 చోట్ల ప్రభుత్వ స్థలాలను క్రీడా ప్రాంగణాల కోసం గుర్తించారు. వీటిలో ఇటీవల జరిగిన పట్టణ ప్రగతిలో 5 చోట్ల క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. మిగిలిన చోట్ల త్వరలోనే ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పట్టణ ప్రగతితో మార్పు..
పట్టణ ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతమైనది. ఇప్పటి వరకు జరిగిన 3 పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా దీర్ఘకాలిక సమస్యలు అనేకం పరిష్కారమయ్యాయి. ఈ దఫా పట్టణ ప్రగతిలో పారిశుధ్యం, వైకుంఠధామాలు, విద్యుత్, హరితహారం తదితర కార్యక్రమాలు చేపట్టాం. 15 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కార్పొరేటర్లు పూర్తిస్థాయిలో పాల్గొని చాలా సమస్యలకు పరిష్కారం చూపారు.
– పునుకొల్లు నీరజ, కేఎంసీ మేయర్
ప్రతి ఒక్కరిలో అవగాహన పెరిగింది..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి ద్వారా నగర ప్రజల్లో చాలా మందికి పారిశుధ్యం పట్ల అవగాహన పెరిగింది. ముఖ్య ంగా ఖమ్మంలో చాలామంది ప్రజలు చెత్తను మురుగు కాలువల్లో వేస్తున్నారు. దీంతో డ్రెయిన్లన్నీ చెత్తా చెదారంతో నిండుతున్నా యి. చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లుతున్నాయి. చెత్త కాలువల్లో వేయకుండా రోజూ వచ్చే పారిశుధ్య కార్మికులకు ఇస్తే ఇలాంటి సమస్యలు రావు.
–ఆదర్శ్ సురభి, కేఎంసీ కమిషనర్